గేమ్ ఛేంజర్ కలెక్షన్స్.. పెట్టుబడిలో సగమైనా వస్తాయా?
అంతకుముందు కాస్త నెగిటివ్ బజ్ ఉన్నప్పటికీ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
By: Tupaki Desk | 16 Jan 2025 6:17 AM GMTజనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై విడుదలకు ముందు మినిమమ్ హైప్ అయితే క్రియేట్ చేశారు. అంతకుముందు కాస్త నెగిటివ్ బజ్ ఉన్నప్పటికీ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ప్రారంభంలో మంచి ఆసక్తి కలిగించినప్పటికీ, విడుదల తరువాత మాత్రం నెగిటివ్ ఒక్కసారిగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా, కియారా అద్వానీ, అంజలి, ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి ఐదు రోజుల్లోనే ఇండియాలో ₹106.15 కోట్లు నెట్ వసూలు చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ₹154.50 కోట్లు గ్రాస్ సాధించిందని నిర్మాతలు ప్రకటించారు.
అయితే 6వ రోజు కలెక్షన్లను చూస్తే, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రేడ్ పోర్టల్స్ ప్రకారం, 6వ రోజు ఈ సినిమా కేవలం ₹6.50 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభించిన దూకుడు నిలబెట్టుకోలేకపోయిన గేమ్ ఛేంజర్, ఇప్పుడు భారీ నష్టాల బాటలో నడుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల లోపే వసూలు చేసి ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇది నిజమైతే, శంకర్ కెరీర్‌లో మరో భారీ అపజయం గా నిలుస్తుంది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ఇండియన్ 2 కూడా 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, కేవలం ₹148 కోట్లు మాత్రమే వసూలు చేసి పరాజయం పాలైంది. ఇక మరోవైపు దిల్ రాజు కెరీర్ లోనే కాకుండా రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఇది బిగ్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతి పోటీలో విడుదలైన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ, గేమ్ ఛేంజర్‌కు గట్టి పోటీగా నిలుస్తున్నాయి. ప్రేక్షకులను ఆకర్షించడంలో ఈ రెండు సినిమాలు ముందంజ వేయడం గేమ్ ఛేంజర్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇక వీకెండ్ వరకు ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప గేమ్ ఛేంజర్ భారీ నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమే.