'గేమ్ ఛేంజర్' IAS రోల్.. రియల్ లైఫ్ లో ఎవరతను?
ప్రీమియర్స్ తోనే ఓవర్సీస్ లో ఫ్యాన్స్ హడావుడి మొదలైంది.
By: Tupaki Desk | 10 Jan 2025 7:51 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పట్ల రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్స్ తోనే ఓవర్సీస్ లో ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. సినిమా కథాపరంగా రాజకీయ నేపథ్యంతో పాటు ఐఎస్ పాత్ర చుట్టూ డ్రామా ఎమోషన్స్ హైలెట్ అయ్యాయి. అయితే, ముఖ్యంగా రామ్ చరణ్ తన విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం పట్ల ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
కాలేజ్ స్టూడెంట్‌గా ఒక యంగ్ లుక్, IAS అధికారిగా మరో పవర్‌ఫుల్ లుక్, చివరిగా తండ్రి పాత్రలో అప్పన్నగా కనిపించి ప్రేక్షకులను కొత్తగా మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రత్యేకించి, అప్పన్న పాత్రకు అద్భుతమైన స్పందన రావడంతో అభిమానులు థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక IAS అధికారిగా రామ్ నందన్ పాత్ర కూడా ఐకానిక్ రోల్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాత్రను రియలిస్టిక్‌గా చూపించడంలో చరణ్ చేసిన హోమ్‌వర్క్ ప్రశంసనీయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. చరణ్ తన పాత్రకు అవసరమైన డెప్త్‌ను అందించేందుకు కొన్ని ఐఏఎస్ అధికారుల వీడియోలు, జీవిత కథలను గమనించాడని తాను చెప్పడం గమనార్హం.
ఈ పాత్రకు కథా రచయిత కార్తీక్ సుబ్బరాజ్ కల్పనకు తోడు రియల్ లైఫ్ ప్రేరణ కూడా ఉందట. తమిళనాడు కేడర్‌కు చెందిన లెజెండరీ IAS అధికారి తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ జీవితాన్నే కార్తీక్ ఈ పాత్రకు ప్రేరణగా తీసుకున్నారు. తన వర్కింగ్ టైమ్ లో శేషన్ ‘పని బకాసురుడు’ అనే పేరు పొందారు. అధికారిక వ్యవస్థలో తన కఠిన చర్యలతో, ప్రజా ప్రయోజనాల కోసం చేసిన పోరాటంతో ఆయన గుర్తింపు పొందారు.
టిఎన్ శేషన్ పేరు 90ల కాలంలో భారత రాజకీయాల్లో దూసుకుపోయింది. భారత ఎన్నికల కమిషనర్‌గా తన పదవీకాలంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియలో గల అవకతవకలపై కఠినంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ, బహిరంగ సభల్లో అసభ్య పదజాలం వాడడం లాంటి అనేక అంశాలను నియంత్రించి భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
శేషన్ తన కఠిన నిర్ణయాలతో ప్రభుత్వంలో పలు శాఖల ప్రాజెక్టులను అడ్డుకోవడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం, అవినీతి అధికారులకు గట్టి బుద్ధి చెప్పడం వంటి చర్యల వల్ల అతను చట్టపరమైన చిక్కుల్లో కూడా పడ్డారు. అయినప్పటికీ, ప్రజల మనసుల్లో శేషన్ అమరుడిగా నిలిచిపోయారు. తాను IAS అధికారిగా ఉన్నప్పుడు చూపించిన తెగువ, నిజాయితీ ఆయనను అందరికీ ఆదర్శప్రాయంగా నిలిపింది.
శంకర్ ‘గేమ్ ఛేంజర్’ లో శేషన్ జీవితంలోని అనేక సంఘటనలను ఆకర్షణీయంగా తెరపై ఆవిష్కరించాడు. సినిమాలో రాజకీయ వ్యవస్థలోని అవినీతిని, నైతిక విలువల్ని చర్చించే సన్నివేశాలు శేషన్ పాత్రతో సహజంగా ముడిపడ్డాయి. రామ్ నందన్ పాత్రలో చరణ్ చూపిన ఫెర్ఫార్మెన్స్‌కు శేషన్ జీవితం స్పష్టమైన ఆధారమని చెప్పవచ్చు. ఈ ప్రేరణతోనే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక డైలాగులు ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్నాయి. ఇక శేషన్ ప్రేరణతో రూపొందిన రామ్ నందన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో, గేమ్ ఛేంజర్ కమర్షియల్‌గా ఎంతటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.