రాజమండ్రిని రౌండప్ చేసిన గేమ్ ఛేంజర్!
తాజాగా రాజమండ్రి షెడ్యూల్ తోనే చిత్రీకరణ కూడా ముగించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 3 Jun 2024 6:11 AM GMT'గేమ్ ఛేంజర్' కి- రాజమండ్రికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే రాజమండ్రిలో చాలా భాగం షూటింగ్ చేసారు. శంకర్ తొలుత తొలి షెడ్యూల్ అక్కడే ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అదే షెడ్యూల్ కి కొనసాగింపుగా మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరిగింది. ఈ ప్రాసస్ లో రాజమండ్రి టూ హైదరాబాద్ తిరిగిన సందర్భాలెన్నో. తాజాగా రాజమండ్రి షెడ్యూల్ తోనే చిత్రీకరణ కూడా ముగించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
కొత్త షెడ్యూల్ ఈవారం నుంచే రాజమండ్రిలో మొదలవుతుందని సమాచారం. దాదాపు వారం రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుందని సమాచారం. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇది చివరి షెడ్యూల్ అని కూడా అంటున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలోనే ఈ ప్రచారం సాగుతుంది. అయితే ఇది చివరి షెడ్యూలా? ఇంకా షెడ్యూల్స్ ఉన్నాయా? అన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే తెలియదు. రాజమండ్రితో పాటు హైదరాబాద్ లో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఆర్ ఎఫ్ ఎసీ, అల్యుమినియం ఫ్యాక్టరీ, అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ప్రత్యేకంగా సెట్లు వేసి చిత్రీకరించారు. కానీ రాజమండ్రి ఫేమస్ అయినంతగా మరో స్పాట్ ఫేమస్ కాలేదనే చెప్పాలి. అందులోనూ శంకర్ రాజమండ్రి షూటింగ్ స్పాట్ గా తీసుకోవడం అన్నది సంచలనంగా కనిపిస్తుంది. ఇంతవరకూ శంకర్ సినిమాల షూటింగ్ అంటే ఎక్కుగా సెట్స్ లో హైలైట్ అవుతుంటాయి. గతంలో అవసరం మేర కొన్ని సందర్భాల్లో వైజాగ్ ని సైతం షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నారు.
కానీ'గేమ్ ఛేంజర్' విషయంలో వైజాగ్ ని పెద్దగా హైలైట్ చేయలేదు. కేవలం కొన్ని సన్నివేశాలు తప్ప! విశాఖకి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్ నే ఎక్కువగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాతో రాజమండ్రి ఎక్కువగా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రల్లో షూటింగ్ అంటే హైదరాబాద్..వైజాగ్ అని మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఈసారి'గేమ్ ఛేంజర్' తో రాజమండ్రి ఎక్కువగా ఫోకస్ అవుతుంది. హైదరాబాద్, వైజాగ్ సరసన రాజమండ్రి కూడా చేరిపోయింది. ఇప్పటికే గోదావరి అందాల్ని హైలైట్ చేస్తూ ఎన్నో సినిమాల చిత్రీకరణ జరిగిన సంగతి తెలిసిందే.