చరణ్‌ను అలా చూపించడం పెద్ద రిస్క్!
సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...
By: Tupaki Desk | 15 Feb 2025 12:30 PM GMTరామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. హీరో పాత్ర మొదలుకుని చాలా వరకు మైనస్‌లు ఉన్నాయి. సినిమా విడుదల అయినప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా ఈ సినిమా గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాను గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన స్పందన తెలియజేశారు. పరుచూరి పాఠాలు అనే శీర్షికతో వీడియోలను చేస్తూ యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి తన అనుభవాలను తెలియజేస్తున్న గోపాలకృష్ణ తాజాగా గేమ్ ఛేంజర్‌ను విశ్లేషించారు.
సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ అనగానే సహజంగానే అంచనాలు భారీగా పెరుగుతాయి. పైగా శంకర్ మొదటి సినిమా తెలుగులో చేస్తున్నారు, అంతే కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమా లేదని, లాభాలు రాలేదని అనిపిస్తుంది. ఒక పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కథను దర్శకుడు శంకర్ చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా ఆయన నుంచి గతంలో వచ్చిన సినిమాల మాదిరిగా ఈ సినిమాలు ఉంటాయనే నమ్మకం కలిగింది.
సినిమా అనేది అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి. నా డ్రైవర్‌ను ఈ సినిమా గురించి అడిగిన సమయంలో కాస్త అర్థం కాలేదు సర్ అన్నాడు. అంటే అతడికి ఐఏఎస్ కి సంబంధించిన కొన్ని సీన్స్ అర్థం కాలేదు అన్నాడు. అక్కడే నష్టం జరిగింది. హీరో పాత్ర చాలా బాగున్నా దాన్ని చూపించే విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ముఖ్యంగా రామ్ చరణ్ వంటి మాస్ హీరోను క్లాస్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ కోసం తనలోని మాస్ యాంగిల్‌ను దాచి క్లాస్ గా కనిపించేందుకు ప్రయత్నించాడు. అంతే కాకుండా అతడి యొక్క మార్గంలో ఎదురైన ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలోనూ సరైన సన్నివేశాలు పడలేదు.
రామ్ చరణ్ వంటి హీరోను క్లాస్ గా చూపించడం అనేది చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్‌ను స్ట్రాంగ్ పాయింట్‌తో చూపిస్తే పర్వాలేదు. కానీ దర్శకుడు శంకర్ వీక్ పాయింట్‌తో చరణ్‌ను క్లాస్‌గా చూపించడం ద్వారా మొదటికే మోసం వచ్చింది. అందుకే సినిమా గాడి తప్పింది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలింగ్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. సునీల్ మొదట అడ్డంగా నడిచి హీరో సీఎం అయిన వెంటనే చక్కగా నడుస్తూ వచ్చి సెల్యూట్ చేసి ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సైతం చప్పట్లు కొట్టే వారు. అప్పటి వరకు రాజ్యాంగం అడ్డంగా నడిచింది, ఇప్పుడు హీరో ఎంట్రీతో సక్రమంగా నడుస్తుందనే ఇండికేషన్ అయినా వచ్చి ఉండేది అని పరుచూరి వారు అన్నారు. మొత్తానికి సినిమాలోని చాలా మైనస్‌లను ఆయన లేవనెత్తారు. అయితే రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు.