'గేమ్ ఛేంజర్'కి ఇక నో టెన్షన్.. అక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్
పలు అంశాల కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ విడుదల అయ్యేది అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
By: Tupaki Desk | 8 Jan 2025 10:34 AM GMTరామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సినిమాల జాతరలో మొదటి సినిమాగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల విషయమై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ కొనసాగింది. పలు అంశాల కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ విడుదల అయ్యేది అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
తమిళనాట దర్శకుడు శంకర్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలకు ఇండియన్ 3 సినిమా విషయంలో గొడవలు ఉన్నాయి. తమ ఇండియన్ 3 సినిమా పూర్తి చేసి విడుదల చేయకుండా గేమ్ ఛేంజర్‌ను శంకర్ విడుదల చేయడానికి లేదు అంటూ లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టును ఆశ్రయించారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాను తమిళనాట డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాతలతో ఒప్పందం జరగడంతో వివాదం సర్థుమనిగింది. గేమ్ ఛేంజర్‌కి తమిళనాట ఉన్న అడ్డంకులు అన్నీ తొలగి పోయాయి అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో తమిళనాట సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక కన్నడంలో టైటిల్ లేదు అంటూ కర్ణాటకలో భాషా సంఘాల వారు ఆందోళనకు దిగారు. సినిమాను విడుదల కానివ్వం అంటూ ఆందోళన చేశారు. చివరకు అక్కడ సైతం సినిమా బుకింగ్ ప్రారంభం అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్‌లో గేమ్ ఛేంజర్ దూసుకు పోతున్నట్లు బుక్‌మై షో పరిశీలకులు చెబుతున్నారు. గంట గంటలకు టికెట్ల బుకింగ్ సంఖ్య పెరుగుతుందని, మరి కొన్ని గంటల్లో టికెట్ల బుకింగ్ రికార్డ్ నెంబర్‌ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు సమాచారం అందుతోంది.
నైజాం ఏరియాలో టికెట్ల రేట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే టికెట్ల బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. నేడు రాత్రి వరకు ఆ విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక నైజాం ఏరియాలోనూ టికెట్ల బుకింగ్ మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ యొక్క గేమ్ ఆరంభం అయ్యింది. ఈ గేమ్‌లో రామ్ చరణ్ ఏ స్థాయి రికార్డ్‌లను బ్రేక్ చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా మొదటి రోజు వసూళ్ల రికార్డ్‌ను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ విశ్వాసంగా ఉన్నారు. ఈ సంక్రాంతి విజేతగా గేమ్ ఛేంజర్ నిలుస్తుందా అనే విషయం తెలియాలంటే శుక్రవారం మార్నింగ్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే.