Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీమియర్స్.. కలెక్షన్లలో ఊహించని ట్విస్ట్

టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు విదేశీ మార్కెట్లోనూ గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోవాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 8:16 AM GMT
గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీమియర్స్.. కలెక్షన్లలో ఊహించని ట్విస్ట్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రమోషన్ హడావుడి పెంచిన తరువాత భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలయ్యింది. హై బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు విదేశీ మార్కెట్లోనూ గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోవాలని చూస్తోంది.

ఇక అమెరికా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. నార్త్ అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీమియర్ షోలు భారీగానే ప్రదర్శించారు. అమెరికాలోని 511 థియేటర్లలో 1,750 ప్రదర్శనలతో రికార్డు స్థాయిలో విడుదల చేశారు. ఈ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమా సుమారు $650K వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది.

అసలైతే కెనడా, స్పాట్ బుకింగ్స్ సహా మొత్తం $1 మిలియన్ మార్క్‌ను దాటుతుందని భావించారు. అయితే ప్రీమియర్ షోల ముందు ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. నార్త్ అమెరికాలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో కంటెంట్ డ్రైవ్‌ల ఆలస్యమైన డెలివరీ కారణంగా AMC ఛైన్‌లో ప్రదర్శన రద్దు చేయాల్సి వచ్చింది. ఈ రద్దుతో గేమ్ ఛేంజర్ ప్రీమియర్ వసూళ్లపై ప్రభావం పడింది.

దాదాపు $100K మేర నష్టం జరిగినట్లు సమాచారం. ఈ పరిణామంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ప్రీమియర్ షోస్ ముగిసిన నేపథ్యంలో నార్త్ అమెరికాలో గేమ్ ఛేంజర్ $925K వసూలు చేసినట్లు సమాచారం. ప్రీమియర్ వసూళ్లు అంతగా ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం కొంత నిరాశగా అనిపించినా, రోజంతా షోలు కొనసాగుతుండడంతో తొలి రోజు మొత్తం వసూళ్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్ ప్రకారం, వాస్తవిక వసూళ్లు త్వరలోనే వెల్లడికానున్నాయి. లేటెస్ట్ పరిస్థితుల ప్రకారం, గేమ్ ఛేంజర్ నార్త్ అమెరికా మార్కెట్లో బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకోవాలంటే 4.5 మిలియన్ రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఈ టార్గెట్ చేరుకోవడం సాధ్యమేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్ చరణ్ సినిమాలు విదేశీ మార్కెట్లో మంచి ఫాలోయింగ్‌ను కలిగి ఉండడం గేమ్ ఛేంజర్ కు కలిసొచ్చే అంశం. అయితే మొదటిరోజు వసూళ్లు, మౌత్ టాక్ ఆధారంగా ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది క్లారిటీ వస్తుంది. నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు ప్రమోషన్లను పకడ్బందీగా కొనసాగిస్తున్నారు.