సింహంతో చిరుత ఫైట్.. ఈసారి గెలిచేదెవరు?
కానీ చివరకు చిరు తప్పుకొని రేసులోకి చిరుతను పంపిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Oct 2024 4:15 AM GMTటాలీవుడ్ లో మెగా, నందమూరి హీరోల మధ్య ఎన్నో దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. నిజ జీవితంలో వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉన్నా.. సినిమాల విషయానికి వస్తే మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించాలని, బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చెయ్యాలని ఇరు వర్గాల అభిమానులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి 'మెగా Vs నందమూరి' క్లాష్ ఏర్పడుతోంది. రెండు రోజుల గ్యాప్ లో వీరి సినిమాలు బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ గతంలో అనేకసార్లు పోటీ పడ్డారు. 2017 సంక్రాంతికి ఒక్క రోజు తేడాతో 'ఖైదీ నెం. 150', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలు రిలీజ్ అవ్వగా.. రెండూ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. అలానే 2023 పొంగల్ సీజన్ లో 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహా రెడ్డి' సినిమాలు విడుదలయ్యాయి. రెండు చిత్రాలూ సక్సెస్ సాధించాయి. కాకపోతే రెండు సందర్భాల్లోనూ కలెక్షన్స్ పరంగా బాలయ్యపై చిరు పైచేయి సాధించారు.
2025 సంక్రాంతికి కూడా ఇద్దరు సూపర్ సీనియర్ల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర'.. బాలకృష్ణ 'NBK109' చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తాయని అనుకున్నారు. కానీ చివరకు చిరు తప్పుకొని రేసులోకి చిరుతను పంపిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK109 సినిమాని జనవరి 12న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి పండక్కి బాలయ్య, చెర్రీల మధ్య పోటీ అనివార్యమైంది.
గతంలో 2019 సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. భారీ డిజాస్టర్లుగా మారాయి. ఆరేళ్ల తర్వాత మళ్ళీ 2025 ఫెస్టివల్ సీజన్ లో వీరిద్దరూ బరిలో దిగుతున్నాయి. గేమ్ ఛేంజర్, బాలయ్య109 సినిమాలు ఢీకొట్ట బోతున్నాయి. అందుకే మెగా, నందమూరి హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సింహం Vs చిరుత బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో అనే విషయం మీద ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నారు.
ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే, రెండు సంక్రాంతి సినిమాల్లోనూ అగ్ర నిర్మాత దిల్ రాజు భాగం అవుతున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న #NBK109 సినిమాకి తెలుగు స్టేట్స్ లో దిల్ రాజు మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. దీంతో రాబోయే సంక్రాంతికి దిల్ రాజు ఇరు వర్గాల ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా రెండు సినిమాలను ఎలా విడుదల చేస్తారు? సరిపడా థియేటర్లు ఎలా కేటాయిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో!