చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్..?
మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
By: Tupaki Desk | 9 Oct 2024 3:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. దీంతో నెల రోజుల గ్యాప్ లో మెగా తండ్రీ కొడుకుల సినిమాలు వస్తున్నాయని అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమాల విడుదల తేదీలు మారే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమా చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాని క్రిస్మస్ సీజన్ లో థియేటర్లలోకి తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు స్వయంగా తెలిపారు. రీసెంట్ గా అక్కినేని నాగార్జున అడిగితే 'బిగ్ బాస్' వేదిక మీద కూడా ఇదే చెప్పారు. దీంతో డిసెంబర్ 20 లేదా డిసెంబర్ 25న రావొచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త రిలీజ్ డేట్ వినిపిస్తోంది.
'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని 2025 సంక్రాంతి బరిలో దించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎందుకంటే 'విశ్వంభర' సినిమా పండక్కి రాకపోవడమే అనే మాట గట్టిగా వినిపిస్తోంది. చిరంజీవి చిత్రాన్ని జనవరి 10న విడుదల చేస్తామని షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ప్రకటించారు. కానీ ఇప్పుడు డిజిటల్ ఒప్పందాల కారణంగా పొంగల్ రేసు నుంచి తప్పుకోనుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటుకు డిజిటల్ రైట్స్ కోట్ చేస్తున్నప్పటికీ, జనవరి స్లాట్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనే కండిషన్ పెడుతున్నారట. ఈ విషయం మీద మేకర్స్ ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతున్నారట.
ఒకవేళ 'విశ్వంభర' సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటే, అదే తేదీకి 'గేమ్ ఛేంజర్' ను తీసుకోవాలని దిల్ రాజు ఆలోచిస్తున్నారట. ఈ అంశం మీదనే చిరంజీవి, యూవీ నిర్మాతలతో చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, పొంగల్ కు ప్లాన్ చేసిన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి దిల్ రాజే నిర్మాత. అలానే సంక్రాంతికి రావాలని అనుకుంటున్న బాలకృష్ణ 'NBK 109' డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే. కాబట్టి క్లాష్ లేకుండా మూడు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేసుకునేలా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి షిఫ్ట్ అయిపోతే మాత్రం మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరుగుతాయి. క్రిస్మస్ కి కొన్ని మీడియం రేంజ్ చిత్రాలు షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా 'విశ్వంభర', 'గేమ్ ఛేంజర్' సినిమాల కొత్త విడుదల తేదీల గురించి దసరా తర్వాత ఒక స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి రెండిటిలో ఏ సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ కు పండగే. చూద్దాం ఏం జరుగుతుందో.