Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గేమ్ ఛేంజర్

By:  Tupaki Desk   |   10 Jan 2025 6:11 AM GMT
మూవీ రివ్యూ : గేమ్ ఛేంజర్
X

'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ

నటీనటులు: రామ్ చరణ్-కియారా అద్వానీ-అంజలి- ఎస్.జె.సూర్య-జయరాం-శ్రీకాంత్-సునీల్-సముద్రఖని-నవీన్ చంద్ర-వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: తిరు

కథ: కార్తీక్ సుబ్బరాజ్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాత: దిల్ రాజు

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శంకర్

తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ఆయన అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన తెలుగులో ఓ సినిమా చేశారు. అదే గేమ్ చేంజర్. 'ఆర్ఆర్ఆర్' లాంటి మెగా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రమిది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గేమ్ చేంజర్'.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

రామ్ నందన్ (రామ్ చరణ్) కొత్తగా విశాఖపట్నానికి కలెక్టరుగా నియమితుడైన అధికారి. దాని కంటే ముందు అతను ఐపీఎస్ అధికారిగా పని చేస్తాడు. కాలేజీ రోజుల్లో అతను.. దీపిక (కియారా అద్వానీ)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడుతుంది కానీ.. ఓ కారణం వల్ల అతడికి దూరంగా వెళ్లిపోతుంది. కానీ కలెక్టర్ అయ్యాక రామ్.. మళ్లీ దీపికకు దగ్గరవుతాడు. మరోవైపు రామ్ కలెక్టర్ కాగానే విశాఖలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆపడంతో ఆ మాఫియాను నడిపే మంత్రి మోపిదేవి (ఎస్.జె.సూర్య) కోపం వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా మోపిదేవిపై రామ్ చేయి చేసుకోవడంతో అతను సస్పెండ్ అవుతాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) హఠాత్తుగా చనిపోవడంతో మోపిదేవికి సీఎం అయ్యే అవకాశం వస్తుంది. కానీ చనిపోయే ముందు సత్యమూర్తి తీసుకున్న సంచలన నిర్ణయంతో రామ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఇంతకీ సత్యమూర్తి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.. రామ్ తో అతడికి ఉన్న సంబంధమేంటి.. కొత్త బాధ్యతలు అందుకున్నాక రామ్ ఏం చేశాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

'గేమ్ చేంజర్' నుంచి వచ్చిన తొలి టీజర్లో హీరో రామ్ చరణ్ ను భిన్న అవతారాల్లో చూపించిన శంకర్.. చివర్లో 'ఐయామ్ అన్ ప్రెడిక్టబుల్' అని చెప్పించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాడు. చరణ్ అన్ని గెటప్స్ వేయడం.. 'అన్ ప్రెడిక్టబుల్' డైలాగ్ చెప్పడం చూసి.. శంకర్ ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా ఏదో చేయబోతున్నాడనే భావన కలిగింది. కానీ 'గేమ్ చేంజర్' థియేటర్లో కూర్చున్నాక ఆ అన్ ప్రెడిక్టబుల్ థింగ్స్ ఏంటో చూద్దామని ఎదురు చూస్తూనే ఉంటాం. సమయం గడిచిపోతూనే ఉంటుంది. పాత్రలు మామూలుగానే అనిపిస్తుంటాయి. కథ రొటీన్ గానే సాగిపోతుంటాయి. సన్నివేశాల్లో కూడా అంత విశేషం ఏమీ కనిపించదు. శంకర్ కొత్తగా ఇంకేం చూపిస్తాడా అని ఎదురు చూస్తుండగానే.. 'ఎ శంకర్ ఫిలిం' అని ఎండ్ కార్డు పడిపోతుంది. డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ ఇది అంటే నమ్మబుద్ధి కాదు. పోనీ దానికి శంకర్ మార్కు ట్రీట్మెంట్ అయినా తోడైందా అంటే అదీ లేదు. అప్పన్న పాత్రలో చరణ్ పెర్ఫామెన్స్.. కొన్ని ఎపిసోడ్ల వరకు మాత్రం ఓకే అనిపించే 'గేమ్ చేంజర్' ఒక సగటు కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపిస్తుందే తప్ప.. ఇందులో ఎక్కడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు లేవు.

'గేమ్ చేంజర్' ప్రి రిలీజ్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ.. ఇది రీల్స్ కాలం అని.. అందుకు తగ్గట్లే ఏ విషయాన్నయినా తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చెప్పాలని.. 'గేమ్ చేంజర్'లో అదే ప్రయత్నం చేశానని చెప్పుకున్నాడు. ఐతే శంకర్ ట్రెండుకు తగ్గట్లు మారే ప్రయత్నం చేసే క్రమంలో తన బలాన్ని కోల్పోయాడనిపిస్తుంది 'గేమ్ చేంజర్' చూస్తుంటే. సినిమా అంతటా ఏదో హడావుడిగా అనిపిస్తుందే తప్ప.. శంకర్ ఒకప్పట్లా విషయాన్ని బలంగా చెబుతున్న ఫీలింగ్ కలగదు. శంకర్ సినిమా అంటే.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఏదో 'స్పెషల్'గా ఉంటుందని చూస్తాం. కానీ హీరో ఇంట్రడక్షన్ నుంచి ఆయన ఒక మూస ధోరణిలో వెళ్లిపోవడమే ఇందులో పెద్ద 'సర్ప్రైజ్'. సామాజికాంశాలను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో తనకే సొంతమైన నైపుణ్యాన్ని ఆయన కోల్పోయారనిపించేలా ఇందులో కథ.. సన్నివేశాలు సాగుతాయి. సమకాలీన పరిస్థితులను.. రాజకీయాలను గుర్తు చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దుకున్నారు కానీ.. వాటిని ప్రెజెంట్ చేయడంలో శంకర్ ఒకప్పుడు చూపించిన షార్ప్ నెస్ ఇప్పుడు కనిపించలేదు. ఆయన సినిమాల్లో ఎప్పుడూ ఉండే బలమైన ఎమోషన్ ఇందులో మిస్సయింది.

'గేమ్ చేంజర్'లో మోస్ట్ ఎఫెక్టివ్ గా అనిపించేది అప్పన్న పాత్ర నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. డబ్బులు లేని రాజకీయం చేయాలని తపించే ఒక నాయకుడి కథను తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చూపించగలిగాడు శంకర్. చరణ్ కూడా మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల ఆ పాత్ర.. ఎపిసోడ్ బాగానే ఎలివేట్ అయ్యాయి. ఈ పాత్ర ఇంకా కొంతసేపు.. అసలు సినిమా అంతే ఇదే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందులో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. కానీ ఆ ఎపిసోడ్ కు కూడా ఒక రొటీన్ ముగింపునిచ్చి.. అప్పటిదాకా చూస్తున్న 'సాధారణ' సినిమాలోకి తిరిగి తీసుకెళ్తాడు శంకర్. దీనికి ముందు తర్వాత మాత్రం 'గేమ్ చేంజర్' చాలా మామూలుగా అనిపిస్తుంది. శంకర్ సినిమాల్లో వీకెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా ఇందులో చరణ్-కియారా మధ్య వచ్చేది చెప్పొచ్చు. హీరోకు యాంగర్ ఇష్యూస్ ఉండడం.. అది కథానాయికకు సమస్యగా మారడం.. దశాబ్దాల నుంచి చూస్తున్నాం. దీంతో సహా చాలా ఎపిసోడ్లు చూస్తే.. శంకర్ వేరే సినిమాల్లోని సన్నివేశాలను అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఒరిజినాలిటీ చూపించట్లేదనిపిస్తుంది.

హీరో ఎంట్రీతోనే ఒక రొటీన్ మాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించే 'గేమ్ చేంజర్'.. ప్రి ఇంటర్వెల్ వరకు మామూలుగా నడిచిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కథలో కీలక మలుపు వచ్చే సన్నివేశాలతో సినిమా కొంచెం పుంజుకుంటుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ అయ్యే వరకు ఓ 40 నిమిషాలు టెంపో మెయింటైన్ చేయగలిగినా.. ఆ తర్వాత మళ్లీ మామూలే. హీరో-విలన్ ఫేసాఫ్ విషయంలో చాలా ఊహించుకుంటాం కానీ.. అదంత ఎఫెక్టివ్ గా లేదు. సినిమా ముగింపు దశకు వచ్చేకొద్దీ సాగతీతగా అనిపిస్తుందే తప్ప.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తించలేకపోయింది. ఎండ్ టైటిల్స్ పడ్డాక.. కొత్తతరం రాజకీయం గురించి హీరో పాత్ర ప్రసంగం ఇస్తుంటే.. ఇలాంటి విషయాలను సన్నివేశాల రూపంలో ఎఫెక్టివ్ గా చెప్పడం కదా శంకర్ స్టైల్.. ఇలా లెక్చర్ ఇప్పిస్తున్నాడేంటి అనే సందేహం కలుగుతుంది. అలాంటపుడు 'శంకర్ ఈజ్ బ్యాక్' అని ఎలా అనగలం?

నటీనటులు:

రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో బాగానే చేశాడు. ఐతే కాసేపే కనిపించినా.. అప్పన్న పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తుంది. వైకల్యంతో కూడిన పాత్ర కావడంతో అందులో 'రంగస్థలం' ఛాయలు కనిపిస్తాయి. తక్కువ నిడివితోనే ప్రేక్షకులను ఆ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. చరణ్ మనసు పెట్టి చేసిన పాత్రలా అనిపించడంతో తన నటన కూడా ఎలివేట్ అయింది. ఇక కాలేజీ కుర్రాడిగా.. సివిల్ సర్వెంటుగా కూడా చరణ్ ఓకే అనిపించాడు. ఆ పాత్రలు.. అందులో తన నటన కొత్తగా అయితే అనిపించదు. హీరోయిన్ కియారా అద్వానీ చూడ్డానికి బాగుంది. పాటల్లో తన అందం హైలైట్ అయింది. కానీ తన పాత్ర మాత్రం అనాసక్తికరంగా సాగుతుంది. అంజలి మంచి పెర్ఫామర్ అని మరోసారి రుజువు చేసింది. తక్కువ సన్నివేశాల్లోనే తనదైన ముద్ర వేసింది. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య తన శక్తిమేర పెర్ఫామ్ చేశాడు కానీ.. తన పాత్ర ఆశించినంత గొప్పగా లేదు. సూర్య విలన్ అంటే తన పాత్ర ఇంకా టిపికల్ గా ఉండాలని కోరుకుంటాం. నెగెటివ్ షేడ్స్ ఉన్న సత్యమూర్తి పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. సహాయ పాత్రలో సముద్రఖని రాణించాడు. సునీల్ పాత్ర నుంచి కామెడీ పిండాలని చూసి ఫెయిలయ్యారు. వెన్నెల కిషోర్ పాత్ర కూడా వృథానే. హుందాతనంతో కూడిన పాత్రలు చేసే జయరాంతో కామెడీ చేయించాలని చూస్తే అది కూడా బూమరాంగ్ అయింది. నవీన్ చంద్ర కూడా తనకు సరిపోని పాత్ర చేశాడు.

సాంకేతిక వర్గం:

'గేమ్ చేంజర్'లో టెక్నికల్ టీం మంచి ఔట్ పుట్ కోసమే ప్రయత్నించింది. కానీ శంకర్ ఒకప్పుడు నెలకొల్పిన ప్రమాణాలను ఈ టీం అందుకోలేకపోయింది. తమన్ పాటల్లో 'జరగండి'.. ఫ్లాష్ బ్యాక్ సాంగ్ బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. 'జరగండి' పాట చిత్రీకరణ టీం చెప్పినంత గొప్పగా లేదు. వెరైటీ సెట్టింగ్.. భారీ ఖర్చును ఎలివేట్ చేసేలా కొరియోగ్రఫీ-సినిమాటోగ్రఫీ లేకపోయాయి. ధోప్ సాంగ్ బాగుంది. నానా హైరానా పాటను సినిమా నుంచి లేపేయడం షాకే. తిరు కెమెరా వర్క్ బాగుంది. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే స్థాయిలో అయితే లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్ గానే కనిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ కథలో తన నుంచి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కథను మలుపు తిప్పే అంశం బాగుంది. సాయిమ ాధవ్ బుర్రా మాటల్లో ఆయన కలం పదును కనిపించలేదు. డైలాగ్స్ మామూలుగా సాగిపోయాయి. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే.. 'ఇండియన్-2'తో పోలిస్తే ఆయనకిది కమ్ బ్యాక్ అనొచ్చు. కానీ దాన్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఆయన అంచనాలను అందుకోలేకపోయాడు. సామాజిక అంశాలను జోడించి టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ అందించే పాత శంకర్ ఇందులో కనిపించలేదు. రైటింగ్.. టేకింగ్ రెండింట్లోనూ శంకర్ మార్కు మిస్సయింది.

చివరగా: గేమ్ చేంజర్.. వీక్ గేమ్

రేటింగ్- 2.25/5