1000 మందితో చరణ్ డ్యాన్స్.. 10 కళలకు నివాళి.. 'రా మచ్చా మచ్చా'
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 26 Sep 2024 4:01 PM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ నుంచి ఇప్పటివరకు ఒక సాంగ్, పోస్టర్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశ వ్యక్తం చేశారు. రీసెంట్ గా సినిమా నిర్మాత దిల్ రాజు.. క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తామని ఓ ఈవెంట్ లో తెలిపారు.
దీంతో అప్పటి నుంచి గేమ్ ఛేంజర్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 20వ తేదీన విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని రోజుల నుంచి గేమ్ ఛేంజర్ అప్డేట్స్ అంటూ సందడి చేస్తున్నారు. ఆయన చెప్పినట్లు.. నిన్న సెకండ్ సింగిల్ 'రా మచ్చా మచ్చా' అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 28న ప్రోమో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టర్ బట్టి సాంగ్ పక్కా మాస్ బీట్ తో ఉండనుందని మ్యూజిక్ లవర్స్ ఓ క్లారిటీకి వచ్చారు.
అదే సమయంలో తాజాగా మేకర్స్ మరో అప్డేట్ తీసుకొచ్చారు. సినిమా మ్యూజిక్ విశేషాలు తెలియజేస్తూ ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. అందులో డైరెక్టర్ శంకర్, సంగీత దర్శకుడు తమన్ హీరో ఎంట్రీ సాంగ్ గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో రా మచ్చా మచ్చా ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ సాంగ్ ద్వారా భారతీయ నృత్య రూపాలతోపాటు జానపద కళలకు నివాళులు అర్పించినట్లు వెల్లడించారు.
'రా మచ్చా మచ్చా' సాంగ్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన 1000 మంది జానపద నృత్యకారులతో రామ్ చరణ్ డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. అభిమానులకు ఆ పాట కచ్చితంగా విజువల్ ఫీస్ట్ అవుతుందని హామీ ఇచ్చారు. సింగిల్- షాట్ డ్యాన్స్ సీక్వెన్స్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఆయా భాషల కోసం అనంత్ శ్రీరామ్, వివేక్ వేల్ మురుగన్, కుమార్ రచించిన ఆ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నకాష్ అజీజ్ తెలుగు, తమిళం, హిందీలో పాడారు.
'రా మచ్చా మచ్చా'నే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా వెల్లడించారు. పది రకాల జానపద నృత్యాలను సాంగ్ ప్రదర్శిస్తుందని చెప్పారు. గుస్సాడి (తెలంగాణ), కొమ్ముకోయ, తప్పెట గుళ్ళు (ఆంధ్రప్రదేశ్), ఘుమురా, దుర్వా (ఒరిస్సా), గొరవర, హలక్కీ (కర్ణాటక), చవు (పశ్చిమ బెంగాల్), పైకా (జార్ఖండ్) కళలను పాటలో చూడవచ్చని మేకర్స్ తెలిపారు. దీంతో 'రా మచ్చా మచ్చా' సాంగ్ పై ఫుల్ గా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ పాట ఎలా ఉంటుందో వేచి చూడాలి.