Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. రిలీజ్ దారికొచ్చినట్లే..

తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:30 AM GMT
గేమ్ ఛేంజర్.. రిలీజ్ దారికొచ్చినట్లే..
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి జరగండి సాంగ్ ను రిలీజ్ చేసిన గేమ్ ఛేంజర్ మేకర్స్.. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఎప్పుడొస్తుందనే విషయంపై అనేక వార్తలు వస్తున్నా.. మేకర్స్ మాత్రం అధికారికంగా స్పందించడం లేదు. దీంతో ఈ మూవీ విడుదలెప్పుడనేది మెగా అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారిపోయింది.

తాజాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు కుమార్తె.. అక్టోబర్ లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు దీపావళికి ఈ మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని దిల్ రాజు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ సినిమా సీజీ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. రెగ్యులర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని వినికిడి. ఏదేమైనా జులై రెండో వారంలో గేమ్ ఛేంజర్ విడుదలపై క్లారిటీ వచ్చేయనుందని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల దీపావళి మిస్ అయితే క్రిస్మస్ కు రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.

ఈ సినిమాలో సునీల్, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, హ్యారీ జోష్‌, ఎస్‌ జే సూర్య, స‌ముద్ర ఖని, జ‌య‌రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్‌ తో పాటు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. అయితే దీపావళికి భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఫిక్స్ కాలేదు. మరి గేమ్ ఛేంజర్ నార్త్ లో ఎలా అలరిస్తుందో చూడాలి.