గేమ్ ఛేంజర్.. బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది?
కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో షెడ్యూల్ జరపగా.. ఇటీవల హైదరాబాద్ లో షూట్ చేశారు.
By: Tupaki Desk | 4 Jun 2024 11:11 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో మొదలైన చిత్రీకరణ ఇప్పటికీ ఇంకా పూర్తవ్వలేదు. శంకర్.. అటు గేమ్ ఛేంజర్ ను తీస్తూ.. ఇటు ఇండియన్-2ను పూర్తి చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ పెండింగ్ లో ఉండిపోయింది. కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో షెడ్యూల్ జరపగా.. ఇటీవల హైదరాబాద్ లో షూట్ చేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకెప్పుడు పూర్తవుతుంది సారూ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ ఉంటుందా లేదో కూడా డౌట్ గా ఉందని అంటున్నారు. ఎందుకంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా కల్కి, పుష్ప-2, దేవరతోపాటు మరిన్ని భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వాటితోపాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇటీవల ఈ మూవీ రిలీజ్ అక్టోబర్ లో ఉంటుందని గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి తిరుమలలో తెలిపారు. దీంతో దేవర ప్రీ పోన్ అవుతుందని.. అదే రోజు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. మరికొందరు దీపావళి కానుకగా విడుదల అవ్వనుందని చెబుతున్నారు. వీటి కన్నా ముందు షూటింగ్ పూర్తి చేసి పెద్ద ఎత్తున మేకర్స్ ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మరో 30 రోజులపాటు జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో రామ్ చరణ్ వర్కింగ్ డేస్ పది రోజులు మాత్రమేనని టాక్ వినిపిస్తోంది. అంటే జులై స్టార్టింగ్ లో ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారన్నమాట మేకర్స్. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయండన్నా అని అంటున్నారు. అక్టోబర్ లో ఎలా అయినా రిలీజ్ చేయాలని మేకర్స్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ఐపీఎస్ గా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ, అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో చూడాలి.