Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. లీగల్ యాక్షన్ షురూ

అయితే తాజాగా చిత్రంలోని జరగండి జరగండి సాంగ్ బేసిక్ వెర్షన్ లీక్ అయింది. సోషల్ మీడియా అంతటా వైరల్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 1:02 PM GMT
గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. లీగల్ యాక్షన్ షురూ
X

'గేమ్ ఛేంజర్' సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్ బేసిక్ వెర్షన్ తో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈసారి ఈ లీకులకు ఇంటి దొంగలే కారణం అయి ఉంటారని బయట టాక్ వినిపిస్తోంది. అయితే సాంగ్ లీక్ అవ్వడంపై ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సీరియస్ అయ్యారు! దీనికి గల కారకులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనల్​ లో ఫిర్యాదు కూడా చేశారు.


ప్రస్తుతం మేము శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్-కియారా అద్వాణీ ప్రధాన పాత్రలో గేమ్ ఛేంజర్ సినిమా నిర్మిస్తున్నాం. అయితే తాజాగా చిత్రంలోని జరగండి జరగండి సాంగ్ బేసిక్ వెర్షన్ లీక్ అయింది. సోషల్ మీడియా అంతటా వైరల్ అయిపోయింది.


ఈ సాంగ్ లీకై ఇంత ఫాస్ట్ గా వైరల్ అవ్వడం చూసి షాక్ అయ్యాం. దయచేసి ఈ లీక్ కు కారణమైన వారిని కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే మా సాంగ్ ను వాట్సాప్ తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేసే వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు లెటర్ ను నిర్మాత దిల్ రాజు.. తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికార ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ సాంగ్ లీక్ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ లీకైన పాట లిరిక్స్ బాగోలేదని, తమన్ కంపోజ్ కూడా సెట్ అవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్ ను సినిమా నుంచి తప్పించాలంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది రామ్ చరణ్ అభిమానుల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. సాంగ్ పూర్తి వెర్షన్ వచ్చాక అద్భుతంగా ఉంటుందని పోస్టులు చేస్తున్నారు. అలాగే సాంగ్ ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే ఇలా లీక్ కు పాల్పడటం సరికాదంటూ చెబుతున్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ సాంగ్ ను డిలీట్ చేసేలా టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ట్విటర్ లో చాలా అకౌంట్స్ నుంచి డిలీట్ అయిపోయింది. ఈ విషయంపై దర్శకుడు శంకర్-దిల్ రాజు-తమన్.. కలిసి.. వందల కోట్లు ఖర్చు పెడుతూ కూడా.. జాగ్రత్త తీసుకోవడంలో ఎక్కడ విఫలమవుతున్నారో ఫోన్ లో పరస్పరం చర్చించుకున్నారని తెలిసింది. చూడాలి మరి ఏం చేస్తారో.. త్వరలోనే ఫైనల్ వెర్షన్ సిద్ధం చేసి పాటను రిలీజ్ చేస్తారో లేదంటే లిరిక్స్ ను మార్చేస్తారో..