Begin typing your search above and press return to search.

'గం గం గణేశా' మూవీ రివ్యూ

గత ఏడాది సెన్సేషనల్ హిట్ అయిన 'బేబి' చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం.. గం గం గణేశా.

By:  Tupaki Desk   |   31 May 2024 10:32 AM GMT
గం గం గణేశా మూవీ రివ్యూ
X

'గం గం గణేశా' మూవీ రివ్యూ

నటీనటులు: ఆనంద్ దేవరకొండ-ప్రగతి శ్రీవాస్తవ-నయన్ సారిక-ఇమ్మాన్యుయెల్-వెన్నెల కిషోర్-రాజ్ అర్జున్-సత్యం రాజేష్ తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాడి

నిర్మాతలు: కేదార్ శెలగంశెట్టి-వంశీ కారుమంచి

రచన-దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి

గత ఏడాది సెన్సేషనల్ హిట్ అయిన 'బేబి' చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం.. గం గం గణేశా. దీని టీజర్.. ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి అవి ఉన్నంత వినోదాత్మకంగా.. థ్రిల్లింగ్ గా సినిమా కూడా ఉందా? చూద్దాం పదండి.

కథ: గణేష్ (ఆనంద్ దేవరకొండ) ఒక అనాథ. తన స్నేహితుడితో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతను ప్రేమించిన అమ్మాయి డబ్బున్న వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోవడంతో తన పెళ్లికంటే ముందే బాగా డబ్బు సంపాదించి చూపించాలనే పట్టుదలకు పోతాడు గణేష్. ఆ క్రమంలోనే ఒక జ్యువెలరీ షాపు నుంచి విలువైన డైమండుని దొంగిలించే డీల్ కు ఒప్పుకుంటాడు. ఐతే డైమండుని దొంగిలించాక దాన్ని తామే అమ్ముకుని కోటీశ్వరులు అయిపోదామనుకుంటాడు గణేష్. అలా ఆ వజ్రాన్ని తీసుకుని పారిపోతున్న క్రమంలో గణేష్.. తన మిత్రుడికి అనేక సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలేంటి.. వాటిని గణేష్ అధిగమించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: క్రైమ్ కామెడీ.. సినిమాలకు మహ రాజ పోషకులైన యువ ప్రేక్షకులకు బాగా నచ్చే జానర్. వైవిధ్యం చూపించడానికి.. థ్రిల్ చేయడానికి.. వినోదం పంచడానికి ఈ జానర్ మంచి ఆప్షన్. అందుకే చాలామంది కొత్త దర్శకులు ఈ జానర్లోనే తొలి సినిమా ట్రై చేస్తుంటారు. కథ కొత్తగా లేకపోయినా.. ఏ హాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమా నుంచో స్ఫూర్తి పొందినా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపిస్తే చాలు యూత్ ఎగబడి చూస్తారు. కానీ తెలుగులో ఈ జానర్ ను సరిగ్గా ఉపయోగించుకుని విజయవంతమైని సినిమాలు అందించిన దర్శకులు అరుదు. 90వ దశకంలో రామ్ గోపాల్ వర్మ 'క్షణక్షణం' రూపంలో ఒక కల్ట్ మూవీని అందిస్తే.. ఆయన్నుంచే స్ఫూర్తి పొంది సుధీర్ వర్మ అనే యంగ్ డైరెక్టర్ 'స్వామి రారా' అనే మరో కల్ట్ క్రైమ్ కామెడీ అందించాడు. కానీ 'స్వామి రారా' సాధించిన సక్సెస్ చూసి ఆ శైలిలో తర్వాతి దశాబ్ద కాలంలో బోలెడన్ని క్రైమ్ కామెడీలు వచ్చాయి. కానీ ఏవీ 'స్వామి రారా' దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఇప్పుడు 'గం గం గణేశా' సేమ్ 'స్వామి రారా' టెంప్లేట్ ను ఫాలో అయింది కానీ.. దానికిది డూప్లికేట్ లాగా తయారైంది తప్ప.. సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది.

'స్వామి రారా'ను 'గం గం గణేశా' అనుకరించిందని చెప్పడానికి ప్రధాన కారణం.. అందులో మాదిరే ఇందులోనూ వినాయకుడి విగ్రహం చుట్టూనే కథ నడవడం. అందులో మాదిరే ఇందులోనూ హీరో తన ఫ్రెండు చిన్నపాటి దొంగతనాలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఓ పెద్ద డీల్ లో భాగమవుతారు. విలువైన వినాయకుడి విగ్రహం కోసం కొన్ని గ్యాంగులు నువ్వా నేనా అని కొట్టేసుకునే నేపథ్యంలో ట్విస్టులు.. టర్నులతో కథ నడుస్తుంది. కానీ క్రైమ్ కామెడీ అనగానే చాలామంది చేసే తప్పు.. కామెడీ కోసం సిల్లీగా సీన్లు నడిపించడం. లాజిక్ సంగతి గాలికి వదిలేయడం.. ఇంటెన్సిటీ గురించి పట్టించుకోకపోవడం. కథాకథనాలు సీరియస్ గానే ఉండి.. అందులో పాత్రలు పడే అవస్థలు.. తికమక నేపథ్యంలో ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించాలి కానీ.. కామెడీ కోసమని సిల్లీగా సీన్లు నడిపిస్తే మొత్తం వ్యవహారం చెడిపోతుంది. 'గం గం గణేశా'లో సరిగ్గా అదే జరిగింది. వంద కోట్ల విలువైన విగ్రహం అంటే.. దాని చుట్టూ వ్యవహారం ఎంతో పకడ్బందీగా ఉండాలి. ప్రేక్షకులు ఆ తీవ్రతను ఫీలయ్యేలా సన్నివేశాలు రూపొందించాలి. కానీ అంత విలువైన విగ్రహాన్ని చాలా సింపుల్ గా ముంబయి నుంచి తీసుకొచ్చేయడం.. మధ్యలో తేలిగ్గా విగ్రహాన్ని మార్చేయడం చూశాక ఇంటెన్సిటీకి అవకాశమే లేకపోయింది. మారిన విగ్రహాన్ని చేజిక్కించుకునేందుకు గ్యాంగ్స్ పడే పాట్లు అన్నీ కూడా సిల్లీగా ఉండడం వల్ల కూడా ఏ దశలోనూ ఈ సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి.

ఎమ్మెల్యే మనుషులైన కరడుగట్టిన రౌడీలు ముంబయి నుంచి తేలిగ్గా తమ టౌనుకి తీసుకొచ్చేస్తారు కానీ ఒక గ్రామం నుంచి మాత్రం దాన్ని ఎత్తుకు వెళ్ళలేక నానా అవస్థలు పడతారు. ముఖ్యంగా ద్వితీయార్థం అంతా గ్రామంలోని విగ్రహం కోసం గ్యాంగ్స్ పడే పాట్ల చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ సీన్లన్నీ రిపిటీటివ్ గా అనిపిస్తాయి. ఒక దశ దాటాక ఆ సీన్లు విసుగు పుట్టిస్తాయి.

'గం గం గణేశా'లో చెప్పుకోదగ్గ అంశం అంటే.. అక్కడక్కడా కథతో సంబంధం లేకుండా సాగే కామెడీ సీన్లే. మత్తు మందు ఇచ్చి అవయవాలు కోసుకు వెళ్లిపోయే పిచ్చి డాక్టర్ పాత్రలో వెన్నెల కిషోర్ అప్పుడప్పుడూ కనిపించినా మంచి నవ్వులు పంచాడు. సమయం సందర్భం లేకుండా వచ్చి పడిపోయే తన పాత్ర.. ఆ పాత్ర చిత్రణ ఏదోలా అనిపించినా.. తను కనిపించినపుడల్లా నవ్వులు గ్యారెంటీ. ఇలాగే అక్కడక్కడా కొన్ని సీన్లు నవ్విస్తాయి. దీనికి తోడు కొన్ని మలుపులు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఆరంభం నుంచి కూడా ఎలా పడితే అలా సాగిపోయే కథాకథనాలు.. సిల్లీ సీన్లు సినిమా మీద ఏ దశలోనూ ఇంప్రెషన్ క్రియేట్ చేయవు. హీరో రెండు లవ్ స్టోరీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరో పాత్ర కూడా ఒక దశా దిశా లేకుండా సాగిపోతుంది. ఆ పాత్రతో ఏమాత్రం కనెక్ట్ కాలేం. తన ఎమోషన్ ప్రేక్షకులకు ఎక్కదు. ద్వితీయార్ధంలో ట్విస్టుల దగ్గర కొంచెం ప్రేక్షకులు అటెన్షన్ పే చేస్తారు తప్ప.. మిగతా అంతా బోరింగ్ వ్యవహారమే. ఓవరాల్ గా 'గం గం గణేశా' ఏ ప్రత్యేకత లేని ఒక సగటు క్రైమ్ కామెడీ మూవీగా నిలిచిపోతుంది. ఈ సినిమా అక్కడక్కడా కొంత నవ్వించినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది.

నటీనటులు: 'బేబి' సినిమాలో ఆనంద్ నటన ఆశ్చర్యపరిచింది. ఐతే పాత్ర బాగుంటేనే ఏ నటుడి ప్రతిభైనా బయటికి వస్తుంది. 'గం గం గణేశా'లో ఆనంద్ క్యారెక్టర్ చాలా సాధారణంగా తయారవడంతో తన బలహీనతలు మరోసారి బయటికి వచ్చాయి. తన పాత్ర మైనస్ లను కవర్ చేసే స్థాయిలో ఆనంద్ పెర్ఫామ్ చేయలేకపోయాడు. హీరోయిన్లలో 'పెదకాపు' ఫేమ్ ప్రగతి శ్రీవాస్తవ కొంత ఆకట్టుకుంటుంది. పల్లెటూరి అమ్మాయిగా ఆమె ఒదిగిపోయింది. మరో హీరోయిన్ నయన్ సారిక గురించి చెప్పుకోవడానికేమీ లేదు. తన పాత్రను తేల్చి పడేశారు. విలన్ పాత్రలో రాజ్ అర్జున్ నటన ఓకే అనిపిస్తుంది. తన పరిధి తక్కువే. హీరో ఫ్రెండు పాత్రలో ఇమ్మాన్యుయెల్ కొంత నవ్వించాడు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. 'బిగ్ బాస్' ఫేమ్ ప్రిన్స్ యావర్.. సత్యం రాజేష్ తమ పాత్రల్లో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా 'గం గం గణేశా' పర్వాలేదు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. పాటలు సోసోగా సాగిపోయాయి. నేపథ్య సంగీతం క్రైమ్ కామెడీ శైలికి తగ్గట్లే సాగింది. ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువల్లో కొన్ని పరిమితులు కనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి.. తెలుగులోనే కాక పలు భాషల్లో వచ్చిన క్రైమ్ కామెడీలన్నింటినీ అటు ఇటు తిప్పి సినిమా లాగించేశాడు. ముఖ్యంగా 'స్వామి రారా'ను అనుకరణ వల్ల సినిమాలో ఒరిజినాలిటీ కనిపించలేదు. కొన్ని ట్విస్టులు.. కామెడీ సీన్ల వరకు పర్వాలేదనిపించినా.. మొత్తంగా దర్శకుడిగా తొలి ప్రయత్నంలో బలమైన ముద్ర వేయలేకపోయాడు.

చివరగా: గం గం గణేశా.. డూప్లికేట్ నకలు

రేటింగ్-2.25/5