Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గాండీవధారి అర్జున

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:26 AM GMT
మూవీ రివ్యూ : గాండీవధారి అర్జున
X

'గాండీవధారి అర్జున' మూవీ రివ్యూ

నటీనటులు: వరుణ్ తేజ్-సాక్షి వైద్య-నాజర్-వినయ్ రాయ్-విమలా రామన్-నరేన్-రోషిణి ప్రకాష్-మనీష్ చౌదరి-అభినవ్ గోమఠం-రవి వర్మ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఛాయాగ్రహణం: ముకేష్.జి

నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్

రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

గత ఏడాది 'గని' చిత్రంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాడు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. అదే సమయంలో ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్'తో దెబ్బ తిన్నాడు. వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా 'గాండీవధారి అర్జున'. ప్రోమోలు చూస్తే ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ లాగా కనిపించింది. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరుణ్-ప్రవీణ్ లకు బ్రేక్ ఇచ్చేలా ఉందా..? చూద్దాం పదండి.

కథ:

అర్జున్ (వరుణ్ తేజ్) ఒక సెక్యూరిటీ ఏజెంట్. కాంట్రాక్టు మీద యూకేలో సెక్యూరిటీ సర్వీస్ అందిస్తుంటాడు. ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు యూకేకే వచ్చిన భారత పర్యావరణ మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్)కు అర్జున్ సేవలు అవసరమవుతాయి. ఆ మంత్రిని చంపేందుకు ఒక పెద్ద మాఫియా ప్రయత్నిస్తుంటుంది. కొన్ని కారణాల వల్ల మంత్రి దగ్గర పని చేయడం అర్జున్ కు ఇష్టం లేకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకుంటాడు. ఇంతకీ మంత్రిని వెంటాడుతున్న మాఫియా నేపథ్యమేంటి.. వాళ్లెందుకు ఆదిత్యను లక్ష్యంగా చేసుకున్నారు.. వీరి నుంచి ఆయన్ని అర్జున్ ఎలా కాపాడాాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'వాన' సినిమాలో హీరోగా నటించిన వినయ్ రాయ్ గుర్తున్నాడా? దీంతో పాటుగా తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో హీరోగా నటించిన ఈ నటుడు.. తర్వాత విలన్ అవతారం ఎత్తి కోలీవుడ్లో సంచలనం రేపాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదం అయిన డిటెక్టివ్.. వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాల్లో అతడి విలనీ చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోయే ఉంటారు. సూటూ బూటేసుకుని హీరోలను మించి స్టైలిష్ గా కనిపిస్తూనే.. ప్రేక్షకులను భయపెట్టేలా విలనీని పండించడం అతడి ప్రత్యేకత. 'గాండీవధారి అర్జున'లో కూడా అతనే ప్రతినాయకుడు. ట్రైలర్లో అతణ్ని చూసి వరుణ్ లాంటి మంచి కటౌట్ ఉన్న హీరో.. వినయ్ ని ఢీకొంటే ఎంత బాగుంటుందో అని ఎగ్జైట్ అయిన వాళ్లకు ఈ సినిమా దిమ్మదిరిగే షాకిస్తుంది. కొండంత రాగం తీసి.. అనే సామెతను గుర్తు చేస్తూ విలన్ కు అంత బిల్డప్ ఇచ్చి తర్వాత దాన్ని తేల్చి పడేశాడు ప్రవీణ్ సత్తారు. అసలీ సినిమాలో విలన్ ఎందుకు ఉన్నాడు అనిపించేంత సాధారణ పాత్ర అది. అలాంటి విలన్ని ఢీకొట్టే హీరో పాత్ర ఏమాత్రం ఎలివేట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. 'సింగం-3'లో టచ్ చేసిన గార్బేజ్ డంపింగ్ చుట్టూ కథను అల్లుకోవాలన్న ఉద్దేశం మంచిదే కానీ.. అంతకుమించి ఈ సినిమాలో ఎగ్జైట్ చేసే అంశాలేమీ లేవు. పేరుకే 'గాండీవధారి అర్జున' థ్రిల్లర్ కానీ.. సినిమాలో థ్రిల్ రవ్వంత కూడా లేకపోవడం అతి పెద్ద నిరాశ.

తనపై అంచనాలు లేనపుడు 'గరుడవేగ' లాంటి ఆసక్తికర థ్రిల్లర్ సినిమా తీసి ఆశ్చర్యపరిచిన ప్రవీణ్ సత్తారు.. అంచనాలు పెరిగాక 'ది ఘోస్ట్'తో ఎంతగా నిరాశపరిచాడో తెలిసిందే. ఇప్పుడు 'గాండీవధారి అర్జున' చూశాక 'ది ఘోస్ట్' ఎంతో నయం అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కథ.. కొన్ని ఎపిసోడ్ల వరకు అయినా 'ది ఘోస్ట్' పర్వాలేదనిపిస్తుంది. కానీ ప్రవీణ్ కొత్త సినిమా మాత్రం అన్ని రకాలుగా నిరాశపరిచేదే. గత ఏడాది తమిళంలో కార్తి హీరోగా వచ్చిన 'సర్దార్' సినిమాలో వాటర్ బాటిళ్ల వినియోగం పర్యావరణం మీద.. మనుషుల మీద చూపే ప్రతికూల ప్రభావాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపిస్తూనే.. ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో.. ఎంటర్టైన్ చేయడంలో విజయవంతం అయింది. అంతకుముందు విశాల్ చేసిన 'అభిమన్యుడు'లో టెక్నాలజీ ఉచ్చులో చిక్కితే ఎంత ప్రమాదమో ఉత్కంఠభరితంగా చూపించారు. వేరే వాళ్ల సినిమాల వరకు ఎందుకు? 'గరుడవేగ'లో సైతం ప్రవీణ్ సత్తారు ఇలాంటి ప్రయత్నమే చేసి మెప్పించాడు. కానీ ఈసారి మాత్రం అతను ఆ నైపుణ్యం చూపించలేకపోయాడు. గార్బేజ్ డంపింగ్ విషయంలో అతను ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా.. దాంతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో .. సమస్యను అంత ఎఫెక్టివ్ గా తెర మీద ప్రెజెంట్ చేయలేకపోయాడు ప్రవీణ్. ఈ పాయింట్ చుట్టూ ఆసక్తికర కథను అల్లడంలో.. హీరోయిజం పండించడంలో.. ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో అతను ఫెయిలయ్యాడు.

రిచ్ ఫారిన్ లొకేషన్లు.. రిచ్ విజువల్స్.. రిచ్ యాక్షన్ సీక్వెన్స్ తప్పితే.. కంటెంట్ పరంగా ఏమాత్రం 'రిచ్ నెస్' లేని సినిమా 'గాండీవధారి అర్జున'. నిర్మాత మీద మోయలేని భారం మోపడం తప్పితే.. అసలీ సినిమాను పూర్తిగా విదేశీ నేపథ్యంలో నడిపించాల్సిన అవసరమేంటో అర్థం కాదు. కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో సాగదన్న మాటే కానీ.. సినిమాలో కొత్తగా అనిపించే సన్నివేశాలే పెద్దగా లేవు. సినిమా ఆరంభమే చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరో ఇంట్రో సీనే పేలవం. ఇక అతడి తల్లి ఆరోగ్య సమస్య తాలూకు ఇంటెన్సిటీ చూపించాలనుకోవడం ఓకే కానీ.. తెర మీద అలాంటి సీన్లు చూసి తట్టుకోవడం ప్రేక్షకులకు కష్టమే. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్.. వారి బ్రేకప్ కు దారి తీసే సీన్లు అయితే సినిమా మీద ఆసక్తిని ఆరంభంలోనే చంపేస్తాయి. ఇంటర్వెల్ ముంగిట విలన్ ఎంట్రీ దగ్గర 'గాండీవధారి అర్జున' కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. విలన్ చాల ా వయొలెంట్ అన్న సంకేతాలు ఇవ్వడమే కాక.. హీరోకు అతను పెద్ద ఛాలెంజ్ విసరడంతో ద్వితీయార్దంలో వీరి మధ్య 'వార్' రసవత్తరంగా సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. విలన్ ఒక్కసారిగా అంతర్ధానం అయిపోగా.. హీరో ఒక గమ్యం లేనట్లు ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. హీరో-విలన్ మధ్య ఫైట్ లేకుండా అవసరం లేని ఎపిసోడ్లతో ద్వితీయార్ధాన్ని నింపేశాడు దర్శకుడు. ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్ ఎపిసోడ్లు వస్తున్నా అవేమాత్రం ఎంగేజ్ చేయవు. అసలు కథలో మలుపులంటే ఏమీ లేవు. పతాక సన్నివేశాలు కూడా సినిమాను నిలబెట్టలేకపోయాయి. మొత్తంగా చూస్తే అవసరం లేని భారీతనంతో చేసిన ఒక వృథా ప్రయత్నం 'గాండీవధారి అర్జున' అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రతిసారీ తన లుక్స్ గురించే మాట్లాడుకోవాల్సి రావడం విచారకరం. ఇలాంటి కటౌట్ కు సరైన సినిమా పడితే.. అనే ఫీలింగ్ కలిగిస్తాడు అతను. కానీ అతను చేస్తున్న సినిమాలు మాత్రం తన లుక్స్ కు ఏమాత్రం మ్యాచ్ చేసేలా లేవు. సెక్యూరిటీ ఏజెంట్ పాత్రకు అతను బాగా సూటయ్యాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ నటుడిగా అతనేంటో చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వలేదు. పెర్ఫామెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాక్షి వైద్య కూడా చూడ్డానికి బాగుంది. కానీ తన పాత్రలోనూ విషయం లేదు. నాజర్ ముఖ్యమైన పాత్రలో రాణించాడు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ చేయడానికి ఏమీ లేకపోయింది. నరేన్.. రవివర్మ.. అభినవ్ గోమఠం.. ఇలా ఎవ్వరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేెకపోయాడు. అందరి పాత్రలూ తేల్చి పడేశాడు.

సాంకేతిక వర్గం:

మిక్కీ జే మేయర్ సంగీతం ఓకే. ఉన్న ఒక్క పాట సోసోగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాల శైలికి తగ్గట్లుగా సాగింది. ముకేష్ ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ. ఫారిన్ లొకేషన్లను బాగా చూపిస్తూ రిచ్ గా.. స్టైలిష్ గా సినిమాను ప్రెజెంట్ చేశాడతను. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ అవసరానికి మించి ఖర్చు పెట్టారు సినిమా మీద. కానీ ప్రవీణ్ సత్తారు వనరులను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. అసలు ఈ స్క్రిప్టులో ఏం ప్రత్యేకత ఉందని అతను ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయించాడో అర్థం కాదు. ప్రవీణ్ సత్తారు కెరీర్లో అత్యంత దిగువన 'గాండీవధారి అర్జున' నిలుస్తుందనడంలో సందేహం లేదు. తన నరేషన్ చాలా అనాసక్తికరంగా అనిపిస్తుంది. 'గరుడవేగ' తర్వాత అతను టచ్ కోల్పోయిన విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

చివరగా: గాండీవధారి అర్జున.. బిల్డప్ ఎక్కువ కంటెంట్ తక్కువ

రేటింగ్- 2/5