'ఇది కేవలం అవార్డ్ మూవీ కాదు.. అందరికీ నచ్చే కమర్షియాలిటీస్ ఉన్న సినిమా'
ఈ నేపథ్యంలో డైరెక్టర్ పద్మావతి మల్లాది మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో...
By: Tupaki Desk | 20 Jan 2025 11:10 AM GMTజీనియస్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం ''గాంధీ తాత చెట్టు''. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చెట్టుకి, మనిషికి మధ్య అనుబంధాన్ని చాటిచెప్పేలా రూపొందిన ఈ మూవీ.. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పద్మావతి మల్లాది మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో...
''నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నేను చదివే స్కూల్‌కు మా అమ్మే ప్రిన్సిపాల్. స్కూల్‌తో పాటు ఇంట్లోనే తన్నులు తినేదాన్ని. పీజీ పూర్తి చేసిన తరువాత చంద్రశేఖర్ యేలేటి దగ్గర రచన విభాగంలో పనిచేశాను. 'రాధేశ్యామ్' సినిమాకు కూడా రచయితగా పనిచేశాను. ఆ సమయంలోనే 'మహానటి' సినిమాకు రైటర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. 'చూసి చూడగానే' సినిమాకు డైలాగ్స్ రాశాను. 'అమ్ము' అనే సినిమాతో పాటుగా 'బృంద' అనే వెబ్ సీరిస్‌కు రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను''
''చెట్టుకు, మనిషికి లవ్ స్టోరీ రాస్తే ఎలా ఉంటుందని నా ఫ్రెండ్ అన్నాడు. నాకు ఆ ఐడియా బాగా నచ్చింది. నాకు కూడా స్వతహాగా పచ్చదనం, చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ లైన్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మొక్కల గురించి తదుపరి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో 'గాంధీ తాత చెట్టు' కథ రాసుకున్నాను. ఒక అమ్మాయి అహింసవాదంతో ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ ఇది. పూర్తి సందేశంతో పాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా. తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇది కేవలం అవార్డ్ సినిమా కాదు. అందరికి నచ్చే కమర్షియాలిటీస్, ఎమోషన్స్ ఉన్న సినిమా. పాటలతో పాటు రీరికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యత వుంది. కళ్లు మూసుకున్నా ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కథ అర్థమయ్యే విధంగా ఉంటుంది''
''మొదట నా కథ నేపథ్యానికి తగిన వరల్డ్ క్రియేట్ చేద్దామని నిజామాబాద్‌కు వెళ్లాను. అక్కడ ఫ్రెండ్ ఫామ్‌లో నా కథకు కావాల్సిన చెట్టు దొరికింది. చెరుకు తోట ఉన్న రంగంపేట అనే ఊరిలో షూటింగ్ చేశాం. ఆ ఊరిలో జనాలతో యాక్ట్ చేయించాం. అందరూ అక్కడి వాళ్లే. ఎంతో సహజంగా నటించారు. వాళ్లు నటించడం సినిమా ఎంతో సహజంగా రావడానికి ఉపయోగపడింది. ఈ సినిమా కథ 1947లో గాంధీగారు చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది. కథ రాసుకున్నప్పుడే నేను 10వ తరగతి చదువుతున్న టైమ్ నేపథ్యాన్ని ఎంచుకున్నాను. ఈ సినిమా చిత్రీకరణ చాలా నేచురల్‌గా జరిగింది. షూటింగ్ జరుగుతున్న రెండో రోజే తబితా సుకుమార్ తన సమర్పణలో చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. సుకుమార్ సార్ 'ఇది సపరేట్ జోనర్.. నీవు ఎలా తీయాలో అలాగే తీయ్యి. నేను నిన్ను నమ్ముతున్నాను' అని నన్ను ఎంకరేజ్ చేసారు''
''అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రివ్యూ చూసినప్పుడు థియేటర్లో సుకృతిని చూశాను. అప్పుడు మాకు అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు చూసి.. సుకుమార్, తబితా గారి అనుమతితో సెలెక్ట్ చేశాం. రెండు నెలలు వర్క్‌షాప్ చేశాం. అన్ని ముందే రిహార్సల్ చేసేది. 25 రోజుల్లో షూటింగ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సెట్స్ మీదకు వెళ్ళాం. సుకృతి ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చేసింది. ఈ సినిమా కోసం నిజంగా గుండు చేయించుకుంది. పొస్తటిక్ మేకప్ అనేది అంత ఈజీకాదు. దానికి తగిన బడ్జెట్ లేదు. అంతేకాదు కథలో ఆ అమ్మాయి పాత్ర కూడా చాలా ధైర్యవంతురాలైన పాత్ర. ఇలాంటివి అన్నీ పట్టించునే అమ్మాయి కాదు. అమ్మాయిలకు జుట్టు చాలా ఇంపార్టెంట్ కానీ సుకృతి నా కథ తగ్గట్టుగా డేరింగ్ డిసిషన్ తీసుకుంది. నా కథలో అమ్మాయి సుకృతిలోనే నాకు కనిపించిది. గాంధీ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది''
''గాంధీ అనే అమ్మాయి గురించి ఈ కథ. గాంధీ గారి సిద్దాంతాలు ఆ పాత్రలో ఉంటాయి. అలా అని పూర్తిగా గాంధీ గారి బయోపిక్ కాదు ఇది. గాంధీ, తాత, చెట్టు ఈ మూడింటి కథ. సినిమాతో అహింస గురించి చెప్పాను. మనుషుల మధ్య, నేచర్ మధ్య అహింస చాలా అవసరం అనేది తెలియజెప్పాం. అవార్డ్స్ గెలిచిన తరువాత సినిమాను రిలీజ్ చేయాలనేది సుకుమార్ సార్ ఐడియా. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. అవార్డుల వల్ల సినిమాకు రెస్పెక్ట్ పెరిగింది. ప్రతి ఫెస్టివల్లోనూ అవార్డ్ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను''