గంగమ్మ జాతర చరిత్ర వెరీ ఇంట్రెస్టింగ్!
'పుష్ప-2' రిలీజ్ తో గంగమ్మ జాతర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 6 Dec 2024 7:38 AM'పుష్ప-2' రిలీజ్ తో గంగమ్మ జాతర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకూ తిరుపతి వరకే పరిమితమైన జాతర ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. పల్లె నుంచి పట్టణం వరకూ అంతా గంగమ్మ జాతర చర్చే సాగుతోంది. సినిమాలో జాతర సన్నివేశాలకే జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. మరి ఈ జాతర ప్రత్యేకతలు ఏంటి? అంటే తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోనే అతి పెద్ద జన జాతర.
తాతయ్య గుంట గంగమ్మ తిరుపతి గ్రామ దేవత. ఆ గంగమ్మ గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఓ పాలెగాడు తన రాజ్యంలోని యువతలను అత్యాచారం చేసేవాడుట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి ఆ పాలెగాడితో గడపాలని ఆక్షంలు విధించే వాడని చెబుతారు. దాంతో ఆ పాలెగాడిని అంతం చేసేందుకు తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామం కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై ఆ పాలెగాడి కన్ను పడుతుందిట. దీంతో గంగమ్మపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందిట.
ఆమెను తనని వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడుట. రకరకాల మారువేషాల్లో తల్లి మూడు రోజుల పాట గాలించిందిట. మొదటి రోజు బైరాగీ వేషం , రెండో రోజు బండ వేషం, మూడవ రోజు తోటి వేషాలు వేసినా దొర్కపోయే సరికి నాల్గవ రోజు దొర వేషం వేస్తుందిట. తన ప్రభువైన దొర వచ్చా డనుకున్న పాలెగాడు బయటకు రావడంతో గంగమ్మ అతడిని వధించిందిట. దానికి గుర్తుగా తిరుపతితో పాటు చుట్టు పక్కల గ్రామాలు ప్రతీ సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారని చరిత్ర చెబుతుంది.
తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతీ ఏటా చిత్రీణల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేసి ఓడిబాల కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ నూతన వస్త్రాలతో సారెను తీసు కొస్తారు. ఈ పసుపు, కుంకుమ అర్దరాత్రి 12 గంటలకు తిరుపతి పోలిమేర్లలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకూ ఊరి ప్రజలెవరు పొలిమేర దాట కూడదని చాటింపు వేస్తారుట. భక్తులు రకరకాల వేషాలు వేయడం ఈ జాతర ప్రత్యేకత.
మొదటి రోజు బైరాగీ వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా, రెండవ రోజు బండ వేషం మనిషి కష్ట నష్టాలకు బెదర కుండా బండలా ఉండాలని గుర్తుగా, మూడవ రోజు చిన్న పిలల వేషం, నాల్గవ రోజు దొర వేషంతో నృత్యాలు చేసి ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు. అదే రోజు పాలెగాడి అంతం జరుగుతుంది. ఐదవ రోజున గంగమ్మ మాంతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికెళ్లి దుఖంలో ఉన్న పాలెగాడి భార్యను ఓదార్చుతుందిట. దీనికి గుర్తుగానే ఐదవ రోజు మాతంగి వేషాలు వేస్తారుట. పురుషులు మీసాలతో ఆడంగి వేషం వేస్తారు. పట్టు చీర, జాకెట్ ధరిస్తారు. మెడలో పూల దండ, నిమ్మకాయల దండలు వేసుకుంటారు. అల్లు అర్జున్ `పుష్ప 2` లో ఇదే గెటప్ లో కనిపిస్తాడు.
ఆరవ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. ఏడవ రోజు జాతర లో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాల్లా ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరం పై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషంలో ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంక మట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్దరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపాన్ని ప్రతిష్టిస్తారు. ఒక వ్యక్తి పేరంటం వేషం వేసి విశ్వరూపం చెంప నరుకుతాడుట. ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంలా పంచుతారుట.
ఉత్సవాల్లో భాగంగా గంగమ్మకు తిరుమల వెంకటేశ్వర స్వామి పుట్టింట సారె పంపే ఆచారం కూడా 400 ఏళ్లగా ఆచారంలో ఉందిట. స్త్రీలు ఆలయంలో పొంగలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అదే రోజు భారీగా జంతు బలి జరుగుతుంది.ఇదీ గంగమ్మ జాతర చరిత్ర.