Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : గ్యాంగ్స్ అఫ్ గోదావరి

By:  Tupaki Desk   |   31 May 2024 6:58 AM GMT
మూవీ రివ్యూ : గ్యాంగ్స్ అఫ్ గోదావరి
X

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రివ్యూ

నటీనటులు: విశ్వక్సేన్-నేహా శర్మ-అంజలి-గోపరాజు రమణ-నాజర్-హైపర్ ఆది-మయాంక్ పరాఖ్-వినోద్ కిషన్ తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: అనిత్ మదాడి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన-దర్శకత్వం: కృష్ణచైతన్య

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. అడపాదడపా హిట్లు కొడుతూ యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే సంపాదించాడు విశ్వక్సేన్. అతడితో రౌడీ ఫెలో.. ఛల్ మోహన రంగ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కృష్ణచైతన్య జట్టు కట్టాడు. వీరి కలయికలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. ఈ రోజే రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

గోదావరి ప్రాంతంలోని కొవ్వూరులోని లంకలో అనాథగా పెరిగిన రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్సేన్)కు పెద్ద పెద్ద కలలుంటాయి. తప్పులు.. మోసాలు చేసి అయినా పెద్ద స్థాయికి ఎదగాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక దొంగతనం చేసి సబ్బుల డీలర్ షిప్ సంపాదిస్తాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు) రమణ దగ్గర చేరి ఆయనకు నమ్మిన బంటుగా మారతాడు. దొరస్వామిరాజు ప్రత్యర్థి అయిన నానాజీ (నాజర్) కూతురైన బుజ్జి (నేహాశెట్టి)తో ప్రేమలో పడ్డ రత్న.. నాటకీయ పరిణామాల మధ్య నానాజీ సాయంతోనే దొరస్వామిరాజు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఇలా ఎదురు లేకుండా సాగిపోయిన రత్నకు.. అధికారం చేపట్టాకే అసలు సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలేంటి.. దీంతో తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అతడి కథకు ముగింపు ఏంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హాలీవుడ్లో 'గాడ్ ఫాదర్' సినిమా ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్. వరల్డ్ సినిమాలో అత్యంత విజయవంతమైన ఫార్ములాగా దీన్ని చెప్పొచ్చు. సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టిన ఒక వ్యక్తి.. అసాధారణ స్థాయికి ఎదిగి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమాన్ని ఆధారంగా చేసుకుని వందల కథలు వచ్చాయి. ఇండియన్ సినిమాలో కూడా ఈ లైన్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కాకపోతే ఆయా కథల బ్యాక్ డ్రాప్ మారుతుంటాయి. తెలుగులో బ్లాక్‌ బస్టర్ అయిన 'పుష్ప'లోనూ ఇలాంటి కథనే చూడొచ్చు. అక్కడ సుకుమార్ ఎర్రచందనం నేర సామ్రాజ్యాన్ని నేపథ్యంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు కృష్ణచైతన్య గోదావరి ప్రాంతంలో ఎవరూ పెద్దగా టచ్ చేయని లంకల నేపథ్యాన్ని తీసుకుని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే గ్యాంగ్ స్టర్ డ్రామాను ప్రేక్షకులకు అందించాడు. అతను ఎంచుకున్న ఆ బ్యాక్ డ్రాపే సినిమాలో మేజర్ హైలైట్. కథ తెలిసినట్లుగా సాగిపోతున్నా.. ఒక డిఫరెంట్ సెటప్ లో సాగే కథనం.. ఆసక్తికరంగా సాగే సన్నివేశాలు.. మంచి విజువల్స్.. ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను రొటీన్ కు భిన్నమైన సినిమాలా నిలబెడతాయి.

ముందే అన్నట్లు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఒక ఫార్ములాతో సాగిపోయే కథే. జీరోగా మొదలుపెట్టి.. పెద్ద స్థాయికి ఎదిగి.. అక్కడ్నుంచి పతనమై.. చివరికి తన జీవితానికి ఒక అర్థవంతమైన ముగింపునివ్వడానికి ప్రయత్నించే వ్యక్తి కథ ఇది. ''గొప్ప వాడు కావాలంటే.. సిగ్గు వదిలేయాలి'' అంటూ ఆరంభంలో హీరో చెప్పే డైలాగులోనే తన క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నవాడు.. పెద్ద వాడైపోవడానికి ఏం చేస్తాడు అనే క్రమంలోనే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రథమార్ధం నడుస్తుంది. లంక గ్రామాల నేపథ్యం ఎంచుకోవడం వల్ల కొత్త తరహా సన్నివేశాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తాను ఎదగడానికి మనుషుల్ని హీరో అడ్డంగా వాడుకునే తీరు వినోదాన్ని పంచుతుంది. తన ప్లాన్లు అన్నీ ఈజీగా వర్కవుట్ అయిపోవడం.. అతను చకచకా మెట్లు ఎక్కేయడం కొంచెం కన్వీనియెంట్ గా అనిపించినా.. సన్నివేశాలు ఎక్కడా బోరింగ్ గా మాత్రం అనిపించవు. హీరో ఎమ్మెల్యే పంచన చేరి.. ఆ ఎమ్మెల్యే మీదే పోటీ చేసి గెలిచే క్రమం ప్రేక్షకులకు మంచి కిక్కు ఇస్తుంది. మధ్యలో చిన్న రొమాంటిక్ ట్రాక్ యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులకు విందే. విశ్వక్ ఈ ఎపిసోడ్లో చెలరేగిపోయాడు. హీరో ఎలివేషన్ కూడా బాగా పండింది.

ఇంటర్వెల్ వరకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మంచి హైలో నడుస్తుంది. ఐతే ఒక వ్యక్తి ఎదుగుతున్నపుడు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు ఉత్సాహం తెప్పించడం కామన్. అదే సమయంలో ఆ వ్యక్తి పతనం అవుతున్నపుడు కొంత నిరాశ ఆవహిస్తుంది. అందుకే ద్వితీయార్ధంలో కొంచెం డల్లుగా మారిన ఫీలింగ్ కలుగుతుంది. రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణచైతన్య కూడా ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుకోవాల్సింది. ఒక దశ వరకు రసవత్తరంగా అనిపించిన డ్రామా.. తర్వాత కొంచెం పలచనగా మారిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ గ్రాఫ్ తగ్గుతున్న టైంలో కొన్ని సీన్లు కొంచెం ఉత్సాహాన్నిస్తాయి. గోదారిలో పడవ మీద జరిగే సెటిల్మెంట్ సీన్ అందులో ఒకటి. ఇలాంటి సీన్లు ద్వితీయార్ధంలో మరి కొన్ని పడి ఉంటే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మరింత హై ఇచ్చేది. సినిమాకు ఇచ్చిన ముగింపు ఓ మోస్తరుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ప్రేక్షకులు ఊహించుకున్నట్లు ఉండదు. దర్శకుడు పతాక సన్నివేశాలను కొంచెం సున్నితంగానే తీర్చిదిద్దాడు. ఐతే రత్న పాత్రకు ఇచ్చిన పేఆఫ్ మాత్రం బాగుంది. మొత్తంగా చూస్తే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే.. రొటీన్ కమర్షియల్ సినిమాల మధ్య కొంచెం భిన్నమైన మూవీగా నిలుస్తుంది. కొన్ని లోపాలున్నా.. ద్వితీయార్ధంలో గ్రాఫ్ తగ్గినా.. ఓవరాల్ గా ఒక్కసారి చూసేందుకు లోటు లేని సినిమా ఇది.

నటీనటులు:

విశ్వక్సేన్ కు లంకల రత్నాకర్ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే పాత్ర అవుతుంది. తనకు ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ ను మించి ఒక పెద్ద గ్రాఫ్ ఉన్న పాత్ర చేశాడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో. కెరీర్లో ఎదుగుతున్న యువ నటుడికి ఇలాంటి పాత్ర దక్కడం అరుదే. ఇలాంటి పాత్రలను ఇమేజ్ ఉన్న స్టార్లు చేస్తేనే బాగుంటుందనిపిస్తుంది. కానీ విశ్వక్ తన పెర్ఫామెన్స్ తో బాగానే మేనేజ్ చేయగలిగాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అన్ని రసాలనూ చక్కగా పండించాడు. ముఖ్యంగా తన పాత్రలో వేరే కోణాలను చూపించే సన్నివేశాల్లో అతను చెలరేగిపోయాడు. కొన్ని సీన్లలో విశ్వక్ పెర్ఫామెన్స్ మాస్ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. హీరోయిన్ నేహా శెట్టికి కూడా పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఒక పాటలో గ్లామర్ షో చేసిన నేహా.. సంప్రదాయ పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కొన్ని సీన్లలో చక్కగా నటించి మెప్పించింది. అంజలి నటిగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వేశ్య పాత్రను అందరూ కన్విన్సింగ్ గా పోషించలేరు. కానీ అంజలి పాత్రకు తగ్గట్లుగా నటించి తన ప్రొఫెషనలిజాన్ని చాటింది. చిన్న చిన్న సహాయ పాత్రలు పోషించే గోపరాజు రమణకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో కీలకమైన పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన బాగా ఉపయోగించుకున్నారు. విలన్ కాని విలన్ పాత్రలో ఆయన అదరగొట్టారు. నాజర్ తక్కువ సన్నివేశాల్లోనే తన అనుభవాన్ని చూపించారు. తమిళ నటుడు వినోద్ కిషన్ తక్కువ నిడివి ఉన్న పాత్రలో ఓకే అనిపించాడు. హీరో పక్కన సహాయ పాత్రలో హైపర్ ఆది, పమ్మి సాయి ఇద్దరు ఆకట్టుకున్నారు. లంకల్లో ఉండే రౌడీల పాత్రల్లో నటించిన ఆర్టిస్టులందరూ బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేశాడు. సినిమా ఆద్యంతం బీజీఎం మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది. పాటలు మరీ గొప్పగా లేకపోయినా తీసిపడేసేలా లేవు. సినిమాలో అలా అలా సాగిపోతాయి. అనిత్ ఛాయాగ్రహణం సినిమాలో మరో హైలైట్. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సితార సంస్థ విశ్వక్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టింది. సినిమాలో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. రైటర్ కమ్ డైరెక్టర్ కృష్ణచైతన్య.. తన కలం పదును చూపించాడు. తన తొలి చిత్రం 'రౌడీ ఫెలో'లో మాదిరే ఇందులోనూ మంచి డైలాగులు రాశాడు. ''గొప్పోడవ్వాలంటే సిగ్గు వదిలేయాలి''.. ''వాడితో దెబ్బలాడేంత చనువుంది కానీ.. మార్చేంత లేదు'' లాంటి డైలాగులు సినిమాలో సందర్భానికి తగ్గట్లుగా బాగా కుదిరాయి. కృష్ణచైతన్య ఎంచుకున్న కథ కొత్తదేమీ కాకపోయినా.. బోర్ కొట్టని కథనంతో ఆసక్తికరంగా నడిపించాడు. ప్రథమార్ధంలో దర్శకుడు మంచి బిగి చూపించాడు. ద్వితీయార్ధంలోనూ కొన్ని సీన్లలో మెరుపులు ఉన్నా.. గ్రాఫ్ కొంచెం తగ్గింది. ఓవరాల్ గా రచయితగా.. దర్శకుడిగా కృష్ణచైతన్యకు మంచి మార్కులే పడతాయి.

చివరగా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా

రేటింగ్- 2.75/5