Begin typing your search above and press return to search.

12ఏళ్లు వేచి చూసాన‌న్న గంగూభాయి ర‌చ‌యిత్రి

జాతీయ అవార్డుపై 'గంగూబాయి కతియావాడి' రచయిత్రి ఉత్కర్షిణి వశిష్ఠ చేసిన కామెంట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:45 AM GMT
12ఏళ్లు వేచి చూసాన‌న్న గంగూభాయి ర‌చ‌యిత్రి
X

జాతీయ అవార్డుపై 'గంగూబాయి కతియావాడి' రచయిత్రి ఉత్కర్షిణి వశిష్ఠ చేసిన కామెంట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స‌ద‌రు ర‌చ‌యిత ఉత్త‌మ స్క్రీన్ ప్లే.. ఉత్త‌మ సంభాష‌ణ‌ల విభాగంలో రెండు జాతీయ అవార్డుల‌ను అందుకోవ‌డం ఒక సంచ‌ల‌నం. వశిష్ఠ భన్సాలీతో స్క్రీన్‌ప్లే రచయిత అవార్డును .. రచయిత ప్రకాష్ కపాడియాతో సంభాషణలకు అవార్డును ఉత్కర్షిణి షేర్ చేసుకున్నారు. ఆమె క్రాఫ్ట్‌కు ఇది అత్యున్నత ప్ర‌మాణాల్ని ధ్రువీకరించింది. తాజా చాటింగ్ సెష‌న్ లో ఉత్క‌ర్షిణి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. "నిజానికి నేను 2012 నుండి ఎదురు చూస్తున్నానని మర్చిపోయాను!" అంటూ స‌ద‌రు ర‌చ‌యిత వ్యాఖ్యానించారు. త‌న‌ను జాతీయ అవార్డ్ వ‌రించింద‌ని తెలిసిన క్ష‌ణం ఎంతో ఆశ్చ‌ర్య‌పోయాన‌ని ర‌చ‌యిత ఉత్కర్షిణి అన్నారు.

ఉదయం ఆరు గంటలకు మా ఇంట్లో ఫోన్ మోగడం ఆగలేదు.. గంగూబాయి కతియావాడికి జాతీయ అవార్డు వ‌చ్చి ఉంటుందేమోన‌ని అందుకే కాల్స్ వచ్చాయ‌ని ర‌చ‌యిత‌ ఉత్కర్షిణి వశిష్ఠ అస్స‌లు ఊహించలేదట‌. "ఫోన్ రింగ్ అవడం చూసినప్పుడు నా మొదటి ఆలోచన ఏమిటంటే.. సార్ (సంజయ్ లీలా భ‌న్సాలీ) ఆఫీసు నుండి నాకు ఎందుకు కాల్ వస్తోంది?" అనుకున్నాను. కానీ ఏదీ ఊహించ‌లేదు. ఇంత‌లోనే నాకు రెండవ ఆలోచన వ‌చ్చింది. "ఇది జాతీయ అవార్డు అయి ఉంటుంది.. బహుశా నేను గెలిచానా?" అంటూ సందిగ్ధంలో ఉన్నాను. నిజానికి ఒక్క అవార్డ్ మాత్రమే అంచనా వేయగలను. కానీ రెండు జాతీయ అవార్డులు నా కలలకు మించినవి.. అని ఉత్క‌ర్షిణి ఆనందం వ్య‌క్తం చేసారు. అమెరికాలో ఇంటి నుండి నాకు కాల్ వ‌చ్చిన‌ప్పుడు ఆనందం ఆవ‌ర్ణ‌మైంది! అని కూడా స‌ద‌రు ర‌చ‌యిత్రి గుర్తు చేసుకున్నారు.

అయితే గంగూబాయిని తెరపైకి తీసుకురావడానికి దాదాపు ఒక దశాబ్దం పాటు నిరీక్షించాన‌ని కూడా ర‌చ‌యిత తెలిపారు. ఓపిగ్గా నిరీక్షించినందుకు ఇది బహుమతి అని కూడా ఆమె భావిస్తోంది. "ఇది మీ సహనం - పట్టుదలకు ప్రతిఫలం" వంటి మెసేజ్‌లు నాకు వస్తున్నాయి. ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుల్లో ఈ అవ‌గాహ‌న గ‌మ‌నించి నేను షాక్ అయ్యాను. లాక్‌డౌన్ సమయంలో సినిమాని నిర్మించడం విడుదల చేయడం చాలా పెయిన్ ఫుల్ గానే సాగింది. నేను ఈ సినిమా రాక కోసం 2012 నుండి ఎదురు చూస్తున్నాననే విష‌యం మర్చిపోయాను. గంగూభాయి చిత్రం వాస్తవానికి గుజారిష్ (2010) తర్వాత తెర‌కెక్కాల్సింది. కానీ అది జ‌ర‌గ‌లేద‌ని ర‌చ‌యిత ఉత్కర్షిణి గుర్తు చేసుకున్నారు.

గంగూభాయిగా న‌టన‌కు గాను ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ చిత్రం నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఆలియా భట్ నటనపై వ్యాఖ్యానిస్తూ.. ఆమె ప్రతిభకు నేను భయపడుతున్నాను. ఆమె రూపురేఖలు అద్భుతం. ఆలియా చేయలేనిది ఏమీ లేదు. చాలా తెలివైనది..గంగు పాత్ర‌లో జీవించింది! అని ఉత్క‌ర్షిణి అన్నారు.