Begin typing your search above and press return to search.

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ నిక‌ర సంప‌ద‌

కేకేఆర్ ను బ‌ల‌మైన నాయ‌క‌త్వం వైపు న‌డిపించ‌డంలో గంబీర్ స‌ఫ‌ల‌మ‌య్యాడు.

By:  Tupaki Desk   |   29 May 2024 1:30 PM GMT
కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ నిక‌ర సంప‌ద‌
X

కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) 2024 సీజన్ ఫైనల్‌లో మే 26న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మూడోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టైటిల్‌ను కైవసం చేసుకుంది. వారి ప్రారంభ రెండు ట్రోఫీలు 2012 , 2014 లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలోనే సాధ్య‌మ‌య్యాయి. 2011లో అతడి రీఎంట్రీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కీల‌క‌ మలుపు. కేకేఆర్ ను బ‌ల‌మైన నాయ‌క‌త్వం వైపు న‌డిపించ‌డంలో గంబీర్ స‌ఫ‌ల‌మ‌య్యాడు.

అతను విజయాల్ని సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించినా కానీ గంభీర్ 2018 IPL వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ నుండి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్)లో చేరాడు. ఢిల్లీ ఫ్రాంచైజీతో ఒక‌ సీజన్ తర్వాత అతడు అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతడు 2022 అలాగే 2023 IPL సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా పనిచేశాడు. కోల్ క‌తా నైట‌ర్ రైడ‌ర్స్ తో అత‌డి అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న మంచి పేరు తెచ్చింది. అత‌డు త‌న టీమ్ ను లీడ్ చేసిన తీరు చెన్నై సూపర్ కింగ్స్‌తో MS ధోనీకి ఉన్న సంబంధాన్ని పోలి ఉంటుంది. కోచ్/మెంటర్‌గా గంభీర్ తిరిగి రావడం వల్ల కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మరో టైటిల్ ను గెలుచుకోగ‌ల‌ద‌ని చాలా మంది విశ్వసించారు.

గంభీర్ 2024 సీజన్‌కు మెంటార్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరడంతో వారి ఆశలు నెరవేరాయి. ఇది జట్టు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మూడవ టైటిల్ గెలుచుకోవ‌డానికి స‌హ‌క‌రించింది. ఐపీఎల్ 2024 టోర్నీ విజ‌యం త‌ర్వాత‌ కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని షారుఖ్ ఖాన్ గంభీర్‌కు ఖాళీ చెక్‌ను అందించాడని.. అతడు కోరుకున్న ధర లేదా ప్యాకేజీకి కనీసం మరో దశాబ్దం పాటు కేకేఆర్ ఫ్రాంచైజీతో ఉండాలని కోరారు.

గౌతమ్ గంభీర్ 2003 నుండి 2016 వరకు భారత క్రికెట్ జట్టులోని కీలక సభ్యులలో ఒకరు. స్పోర్ట్స్ వెబ్ సైట్ల‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అతడి నికర ఆస్తుల‌ విలువ రూ. 205 కోట్లు.

2003లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేసిన గంభీర్ మరుసటి సంవత్సరం ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడు 2007 ప్రపంచ ట్వంటీ 20 మరియు 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారతదేశ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అతడు వరుసగా 41.95, 36.98 , 27.41 బ్యాటింగ్ సగటుతో 58 టెస్టులు, 147 వ‌న్డేలు, 37 T20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి అతడి సంపాదన త‌న నిక‌ర‌ సంపద ఎదుగుద‌ల‌కు గొప్ప‌గా దోహదపడింది.

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత గంభీర్ 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. భారతీయ జనతా పార్టీలో చేరి తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ సీటును గెలుచుకున్నాడు. మింట్ వివ‌రాల‌ ప్రకారం.. గంభీర్ దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లలో వార్షిక ఆదాయం రూ. 12.40 కోట్లు. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచాడు. అతడి భార్య నటాషా ఆదాయం రూ.6.15 లక్షలు. మార్చి 2024లో ఐపీఎల్ సీజన్‌కు ముందు గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.

గంభీర్ రిటైర్మెంట్ తర్వాత పార్ట్ టైమ్ క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు. స్పోర్ట్స్‌కీడా వివ‌రాల ప్రకారం.. వ్యాఖ్యాతగా సంవత్సరానికి రూ. 1.5 కోట్లు సంపాదిస్తున్నాడు. అతడు క్రిక్‌ప్లే, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్, రెడ్‌క్లిఫ్ ల్యాబ్స్, డయాగ్నస్టిక్ సెంటర్ వంటి బ్రాండ్‌లను ప్ర‌మోట్ చేస్తున్నాడు. అతడి వార్షిక ఆదాయం ఎదుగుద‌ల‌కు బ్రాండ్లు స‌హ‌క‌రిస్తున్నాయి.

గంభీర్ త‌న ఆదాయాన్ని స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టాడు. స్క్వేర్ యార్డ్స్ వివ‌రాల‌ ప్రకారం.. అతడికి ఢిల్లీలో రూ. 20 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం.. ఓల్డ్ రాజిందర్ నగర్ .. కరోల్ బాగ్‌లలో దాదాపు రూ. 15 కోట్ల విలువైన మరో రెండు ఆస్తులు ఉన్నాయి. అతని లగ్జరీ కార్ల సేకరణలో ఆడి Q5, BMW 530D, టయోటా కరోలా , మహీంద్రా బొలెరో స్టింగర్ ఉన్నాయి.