కోలీవుడ్ స్టార్స్ పై గౌతమ్ మీనన్ సంచలన వ్యాఖ్యలు..!
తమిళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ కంటే బడ్జెట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 22 Jan 2025 7:04 PM ISTతమిళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ కంటే బడ్జెట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇది డైరెక్టర్ కు మలయాళ డెబ్యూ. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ హీరోల కథల ఎంపికలపై గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ''నిజం చెప్పాలంటే సినిమాలకు పెద్ద బడ్జెట్ అవసరం లేదు. దాని కంటే మంచి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక్క సినిమా కోసం రూ.100 కోట్లు పెట్టే బదులు, రూ.10 కోట్లతో 10 సినిమాలను నిర్మించడంపై దృష్టి పెట్టాలి. చాలా మంది కోలీవుడ్ స్టార్స్ అధిక బడ్జెట్ చిత్రాలలో మాత్రమే నటించాలని కోరుకుంటారు. స్క్రిప్ట్‌ల గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ నాకు ఛాయిస్ ఇస్తే, కథలతో మొదలుపెట్టి అన్నింటినీ మలయాళ పరిశ్రమకు తీసుకువస్తాను. ఎందుకంటే అందులో సగం స్టోరీలు తమిళ సినిమాల్లో ఎప్పటికీ రావు. మలయాళంలో ఏదైనా సినిమా సక్సెస్ సాధిస్తే, దాన్ని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తారు. కానీ తమిళ యాక్టర్స్ మాత్రం అలాంటి ఒరిజినల్ స్క్రిప్ట్‌లకు ఓకే చెప్పరు. బహుశా ఈ స్టేట్మెంట్ తర్వాత ఇకపై నేను తమిళ సినిమాలో నటించలేకపోవచ్చు'' అని అన్నారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తెరకెక్కించిన 'చెలి', 'ఘర్షణ', 'రాఘవన్', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', ' 'ఏమాయ చేసావే', 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'ఎంతవాడు గానీ', 'సాహసం శ్వాసగా సాగిపో' వంటి సినిమాలకు విశేష ఆదరణ లభించింది. అయితే 'లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమాతో హిట్టు కొట్టిన తర్వాత గౌతమ్ మేనన్.. పూర్తిగా యాక్టింగ్ మీద దృష్టి సారించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కెమెరా ముందుకు రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అసలు అది తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. అయితే అనివార్య కారణాల వల్లనే యాక్టర్ అయ్యానని తెలిపారు. దర్శక నిర్మాతలతో ఉన్న మంచి అనుబంధం ఉండటంతో తమ సినిమాల్లో రోల్స్ ఆఫర్ చేస్తున్నారని, నో చెప్పలేక నటనను కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇకపోతే గౌతమ్ మీనన్ తీసిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' సినిమా జనవరి 23, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇదొక విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మమ్ముట్టి కాంపానీ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటుగా గోకుల్ సురేష్, లీనా కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక గౌతమ్ మీనన్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' సినిమా చాలా ఏళ్లుగా విడుదలకు నోచుకోవడం లేదు. విక్రమ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.