'సూర్య S/O కృష్ణన్' గౌతమ్ మీనన్ జీవితకథ?
అయితే ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి, అలాగే కథ రాసుకోవడానికి ప్రేరణ గురించి ఇప్పటివరకూ బయటికి తెలియని విషయాల్ని గౌతమ్ మీనన్ వెల్లడించారు.
By: Tupaki Desk | 21 March 2024 12:30 AM GMTసూర్య నటించిన `సూర్య S/O కృష్ణన్` (వారణం ఆయిరమ్-తమిళం) మేటి క్లాసిక్ చిత్రంగా హృదయాల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ చార్ట్ బస్టర్లలో నిలిచింది. హ్యారిస్ జైరాజ్ అద్భుత స్వరాలు యువతరం హృదయాలను టచ్ చేసాయి. తమిళ వెర్షన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి, అలాగే కథ రాసుకోవడానికి ప్రేరణ గురించి ఇప్పటివరకూ బయటికి తెలియని విషయాల్ని గౌతమ్ మీనన్ వెల్లడించారు.
ముఖ్యంగా ఈ సినిమా కథకు తన జీవితంలో కొన్ని ఘటనలే ప్రేరణ అని ఛూఛాయగా రివీల్ చేసాడు. నిజ జీవితంలో తాను ఎంతగానో ప్రేమించే అభిమానించే తన తండ్రి మరణం గురించి తెలుసుకున్న తర్వాత తన ఎమోషన్ ని తెరపైకి తెచ్చాడు. ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఆధారిత చిత్రం. సూర్య తన గత జీవితాన్ని తన తండ్రితో జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా కథనం రన్ అవుతుంది. ఈ చిత్రం వాస్తవానికి 2007లో తన తండ్రి మరణం గురించి విన్న తర్వాత దర్శకుడు గౌతమ్ మీనన్ తన జీవితం ఎలా సాగిందో దాని నుండి ప్రేరణ పొంది సీన్లు రాసుకున్నాడు. తన తండ్రికి ఈ చిత్రం నివాళి. ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో క్రిటికల్ గా ప్రశంసలు దక్కించుకుంది. హారిస్ జయరాజ్ స్వరపరిచిన మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్‌బస్టర్‌గా నిలవటంతో పాటు విడుదల సమయంలో సూర్యకి నటుడిగా మంచి పేరు తెచ్చిన చిత్రమిది. ఈ రోజు కూడా చాలా మంది ఈ సినిమాని బుల్లితెర ఓటీటీల్లో చూసి ఆనందిస్తున్నారు.
ఆసక్తికరంగా కాస్టింగ్ ఎంపికల గురించి కూడా గౌతమ్ మీనన్ టాప్ సీక్రెట్స్ చెప్పాడు. నిజానికి ఈ చిత్రంలో కీలక పాత్రలకు మోహన్‌లాల్, దీపికా పదుకొణె, నానా పటేకర్‌లు తొలి ఎంపికలు అని గౌతమ్ మీనన్ చెప్పారు. సినిమాలో సూర్య తండ్రి కృష్ణన్ పాత్ర కోసం తన మొదటి ఎంపిక మోహన్‌లాల్ లేదా నానా పటేకర్‌ని తీసుకోవాలని అనుకున్నట్లు గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ఒకే నటుడు ద్విపాత్రాభినయం చేయాలన్న భావన మొదట్లో నచ్చకపోయినప్పటికీ సూర్య అతడిని వేరే విధంగా ఒప్పించాడు. దీంతో సూర్య తండ్రి కొడుకుగా ద్విపాత్రల్లో నటించడానికి దారితీసింది.
అదే ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ ఈ చిత్రంలో మేఘనగా నటించడానికి దీపికా పదుకొణెతో చర్చలు జరిపానని అయితే ఓం శాంతి ఓమ్‌కి కమిట్‌మెంట్, డేట్స్ క్లాష్ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత సమీరా రెడ్డి ఆ పాత్రను పోషించింది.
ప్రారంభం అనుకున్న నటీనటుల ఎంపిక వర్కవుట్ కానప్పటికీ చివరకు సమీర తన మునుపటి చిత్రాలకు భిన్నమైన పాత్రను పోషించి మెప్పించింది. సూర్యకు తల్లిగా సిమ్రాన్ నటించడం.. తండ్రి పాత్రకు జోడీగా నటించడం .. దివ్య స్పందన పాత్రతో ఆసక్తికర మలుపు అన్నీ అద్భుతంగా సరిపోయాయని గౌతమ్ మీనన్ తెలిపారు. వారణం ఆయిరం 2008లో విడుదలైంది. ఇందులో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా, సిమ్రాన్, సమీరా రెడ్డి, దివ్య స్పందన ప్రధాన పాత్రల్లో నటించారు. రెస్క్యూ మిషన్‌లో ఉన్నప్పుడు తన తండ్రి కృష్ణన్ మరణం గురించి తెలుసుకున్న భారతీయ ఆర్మీ మేజర్ సూర్య కథేమిటన్నదే ఈ చిత్రం.