అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి లేదు
ఏదైనా ఒక పని చేసే ముందు, లేదా జీవితంలో ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునే ముందు మన స్నేహితులని కానీ సన్నిహితులను కానీ అభిప్రాయం అడిగి తెలుసుకుంటూ ఉండటం సహజం.
By: Tupaki Desk | 29 March 2025 4:30 PMఏదైనా ఒక పని చేసే ముందు, లేదా జీవితంలో ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునే ముందు మన స్నేహితులని కానీ సన్నిహితులను కానీ అభిప్రాయం అడిగి తెలుసుకుంటూ ఉండటం సహజం. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతులు కాదు. అయితే అలా పక్క వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుని, వాటిని ఫాలో అవడం ప్రతీసారి కరెక్ట్ అనిపించుకోదని చెప్తోంది హీరోయిన్ జెనీలియా.
జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తుజే మేరీ కసమ్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన జెనీలియా తెలుగులో సై, బొమ్మరిల్లు, ఆరెంజ్, రెడీ లాంటి ఎన్నో ఫ్యామిలీ, లవ్ స్టోరీల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటూ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే బొమ్మరిల్లు సినిమాతో జెన్నీ బాగా ఫేమస్ అయింది.
తుజే మేరీ కసమ్ టైమ్ లోనే బాలీవుడ్ నటుడు రితేష్ తో ఫ్రెండ్‌షిప్ చేసిన జెనీలియా, ఆ తర్వాత కొంతకాలానికి అతన్ని ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా దాదాపు 10 ఏళ్ల వరకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తిరిగి పదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేద్దామనుకున్నప్పుడు తాను ఎలాంటి పరిస్థితులను అనుభవించిందో జెనీలియా రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తెలిపింది.
ఆ ఈవెంట్ లో జెనీలియా తన కెరీర్ గురించి, సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలను తెలిపింది. సినిమాల్లోకి కంబ్యాక్ ఇద్దామని డిసైడైనప్పుడు, తెలిసిన వాళ్లెవరూ తనను ఎంకరేజ్ చేయలేదని, ఎంకరేజ్ చేయకపోగా వారు మాట్లాడిన మాటలు తననెంతో బాధపెట్టాయని జెన్నీ తెలిపింది.
సక్సెస్, ఫెయిల్యూర్లు లైఫ్ లో భాగమని, అందుకే తాను కెరీర్ పరంగా జయాపజయాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వనని, మనం లైఫ్ ను ఎలా రన్ చేస్తున్నామనేది అన్నింటికంటే ముఖ్యమని జెనీలియా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా సుమారు 6 భాషల్లో నటించిన తాను పిల్లలు పుట్టాక కావాలని యాక్టింగ్ కు దూరమయ్యానని, మళ్లీ రీసెంట్ గా తిరిగి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు తెలిసినవాళ్లంతా పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? అసలు వర్కవుట్ అవదని నిరాశ పరిచారని చెప్పింది. అయినా సరే డేర్ చేసి రీఎంట్రీ ఇచ్చానని, రితేష్ తో కలిసి చేసిన వేద్ మూవీ మంచి హిట్ గా నిలిచిందని, కాబట్టి అన్ని విషయాల్లో వేరే వాళ్లను నమ్మడానికి లేదని జెనీలియా ఈ సందర్భంగా పేర్కొంది. వేద్ మూవీ మజిలీ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. అయితే సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న పదేళ్లూ తాను తన పిల్లలు, ఫ్యామిలీ పైనే దృష్టి పెట్టినట్టు జెనీలియా వెల్లడించింది.