వారణాసిలో గంగా హారతి.. 300 నటుడు గెరార్డ్ బట్లర్ అనుభవం
300 యోధుడు, హాలీవుడ్ నటుడు గెరార్డ్ బట్లర్ దశాబ్దం క్రితం వారణాసి పర్యటనలో తన జీవితాన్ని మార్చిన అనుభవాన్ని మీడియాకు షేర్ చేసారు
By: Tupaki Desk | 26 Oct 2024 6:08 AM GMT300 యోధుడు, హాలీవుడ్ నటుడు గెరార్డ్ బట్లర్ దశాబ్దం క్రితం వారణాసి పర్యటనలో తన జీవితాన్ని మార్చిన అనుభవాన్ని మీడియాకు షేర్ చేసారు. ఇప్పుడు వైరల్ ఇంటర్వ్యూలో బట్లర్ భారతదేశంలోని పురాతన నగరంతో తన లోతైన సంబంధం గురించి మాట్లాడారు. ఇది తన జీవితంలో అత్యంత శక్తివంతమైన క్షణాలలో ఒకటిగా వర్ణించాడు.
ప్రపంచ సినిమాపై గొప్ప ప్రభావం చూపించిన వారియర్ సినిమా 300లో అతడు యోధుడిగా నటించిన తీరును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. స్పార్టన్స్ కి భయం అంటే తెలియదు.. మరణానికి ఎదురెళ్లడమే వీరుడి లక్షణం అని చెప్పేందుకు అతడి స్ఫురద్రూపం ఎంతగానో ప్లస్ అయింది. 300, ఒలింపస్ హాస్ ఫాలెన్ , PS ఐ లవ్ యు వంటి హాలీవుడ్ హిట్ చిత్రాలలో తన పాత్రలతో పాపులరైన బట్లర్ భారతదేశం అంతటా పర్యటన సందర్భంగా ఏడుగురు స్నేహితులతో కలిసి వారణాసిని సందర్శించినట్లు వెల్లడించాడు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచడంలో లాజిస్టికల్ సవాళ్లు ఉన్నా కానీ, వారణాసి తన ఆత్మపై చెరగని ముద్ర వేసిందని తెలిపాడు. నగరంలో గందరగోళాన్ని అపారమైన హృదయం, ప్రేమతో ఎలా సమతుల్యం చేశారో అతడు గుర్తుచేసుకున్నాడు.
``నేను వారణాసికి వచ్చినప్పుడు గొప్ప అనుభూతులు ఉన్నాయి. అక్కడ పుణ్య క్షేత్రాలను ఉన్నతంగా భావించాను. ఘాట్‌ల వద్ద గంగానది ఒడ్డున ధ్యానం చేశాను. నేను ఒక ప్రైవేట్ పూజ కూడా చేసాను. అది చాలా శక్తివంతమైనది(పవర్‌ఫుల్)``అని బట్లర్ తన ఆధ్యాత్మిక అనుభవాన్ని షేర్ చేసారు. అతడు పడవలో కూర్చొని గంగా ఆరతికి హాజరైన మంత్రముగ్ధమైన క్షణం గురించి వివరించాడు. ఆ రోజు.. తన జీవితంలో అత్యంత అద్భుతమైన రోజులలో ఒకటిగా పేర్కొన్నాడు. నా బెస్ట్ డే.. పవిత్ర స్థలానికి చాలా కనెక్ట్ అయ్యాను.. చాలా అందంగా.. చాలా అద్భుతంగా ఉంది... అని అన్నాడు.