Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ షాకింగ్ డెసిషన్..!

ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ప్రమోషన్ కావాల్సిందే. ఫలానా సినిమా అని తెలియాలంటే ప్రచారం ఉండాల్సిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 10:03 AM GMT
జీహెచ్ఎంసీ షాకింగ్ డెసిషన్..!
X

ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ప్రమోషన్ కావాల్సిందే. ఫలానా సినిమా అని తెలియాలంటే ప్రచారం ఉండాల్సిందే. సినిమాకు రిలీజ్‌కు ముందే ప్రచారం రావాలన్నా.. ప్రజల్లోకి తొరగా వెళ్లాలన్నా వాల్ పోస్టర్స్, వాల్ రైటింగ్స్ కామన్. వాల్ రైటింగ్స్ ఇప్పుడు కనుమరుగైనప్పటికీ.. వాల్ పోస్టర్లు మాత్రం ఇంకా అతికిస్తూనే ఉన్నారు. దశాబ్దాల నుంచి ఆ సంస్కృతి కొనసాగుతోంది. అది.. కేవలం హైదరాబాద్ అనే కాకుండా పట్టణాలు, పల్లెల్లోనూ కనిపిస్తుంటాయి. అయితే.. తాజాగా ఈ విషయంలో జీహెచ్ఎంసీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది సినిమా వాళ్లకు ఊహించని పరిణామం అని చెప్పాలి.

గోడలపై వాల్ పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లపై జీహెచ్ఎంసీ ఓ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరాన్ని అందంగా కనిపించేందుకు.. శుభ్రంగా ఉండే విధంగా చూడేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది. పబ్లిక్ ప్లేసుల్లో గోడలపై అతికించే వాల్ పోస్టర్స్, పర్మిషన్ లేని వాల్ పెయింగ్స్‌ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్లు లోకల్ ప్రింటర్స్‌తో మాట్లాడి అనుమతి లేకుండా అలాంటి వాటిని ప్రింట్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరారు.

ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరైనా వాల్ పోస్టర్లు అంటిస్తే వెంటనే వారికి నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అంతేకాకుండా వారికి భారీగా ఫైన్ వేయాలని కూడా ఆదేశించారు. అలాగే.. సినిమా థియేటర్ వారితోనూ మాట్లాడి.. వాల్ పోస్టర్స్‌ను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీటిని అమలు చేయడంలో డిప్యూటీ కమిషనర్లే కీలకమని, నగరంలో ఎక్కడా రూల్స్ అతిక్రమించినట్లు కనిపించకూడదని ఆదేశించారు.

జీహెచ్ఎంసీ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఖంగుతిన్నది. వాల్ పోస్టర్ల ద్వారా ప్రమోషన్లు లేకుండా సినిమాలను ఎలా ప్రమోట్ చేయగలం అనే ప్రశ్న మొదలైంది. రిలీజ్ డేట్ అయినా.. ఫలానా హీరో సినిమా అయినా తెలియాంలంటే వాల్ పోస్టర్లే కీలకం అని వాపోతున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ నిర్ణయంతో ఇక నుంచి హైదరాబాద్ నగరంలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ పూర్తిగా కనుమరుగైనట్లే అని భావించాల్సిందే. అయితే.. గతంలోనే 2016లో జీహెచ్ఎంసీలో గత ప్రభుత్వం బ్యానర్లపై నిషేధం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సర్క్యులర్‌ను కఠినంగా అమలు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. నగరంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగులపై నిషేధం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిన డిజిటల్ బోర్డులు, వాల్ బోర్డులపై మాత్రమే ప్రకటనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. జీహెచ్ఎంసీ పర్మిషన్‌తో నడుస్తున్న డిజిటల్ బోర్డుల్లో అడ్వర్టయిజ్మెంట్ ఇవ్వాలంటే ఖర్చుతో కూడుకున్నదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.