'గోల్డ్' పాయే.. గిఫ్ట్ అయినా కలిసొచ్చేనా..?
రీసెంట్ గా గిఫ్ట్ అనే సినిమాను ప్రకటించారు. ఈ మూవీ కోసం కూడా ఆయన సంవత్సరం పాటు సమయం తీసుకున్నాడు
By: Tupaki Desk | 13 Sep 2023 5:27 AM GMTమళయాళ సినిమాలకు తెలుగు లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మళయాళంలో విడుదలైన ప్రేమమ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ మూవీ నచ్చి, దానిని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు ఈ మూవీతో తమ కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి వారు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. వాళ్ల కెరీర్ ని అంత సవ్యంగా సాగడానికి వారి మొదటి సినిమా ప్రేమమ్ డైరెక్టర్ అల్పోన్స్ కారణం అని చెప్పొచ్చు.
ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అవియాల్ అనే మూవీ తీశాడు. అది పర్వాలేదనిపించింది. తర్వాత ఫహద్ ఫాజిల్ తో ట్రాన్స్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇది తెలుగులో కూడా డబ్ చేశారు. ఆకట్టుకుంది. అయితే, తర్వాత 2022లో గోల్డ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేమమ్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.
కానీ, ఆ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార లాంటి స్టార్స్ తో సినిమా తీసినా ఆకట్టుకోలేకపోయింది. మూవీలో ఎమోషన్స్ సరిగా పండలేదు. దీంతో, అసలు ఈ సినిమా ప్రేమమ్ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చినదేనా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. సినిమా అస్సలు బాలేదని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలో, ఆ ట్రోల్స్ అన్నీ ఎదుర్కున్న ఆయన, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు.
రీసెంట్ గా గిఫ్ట్ అనే సినిమాను ప్రకటించారు. ఈ మూవీ కోసం కూడా ఆయన సంవత్సరం పాటు సమయం తీసుకున్నాడు. ఈ మూవీలో శాండి, కొత్త నటి సహానా సర్వేష్ లను హీరో, హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సినిమా కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తోంది.
నిజానికి, ప్రేమమ్ తర్వాత డైరెక్టర్ అల్ఫోన్స్ కి అలాంటి మరో హిట్ పడలేదు. ఎన్ని సినిమాలు తీసినా, ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. మరి, ఈ గిఫ్ట్ మూవీతో అయినా, ఆయన మరోసారి తన సత్తా చాటుతారో లేదో చూడాలి. ఇది కూడా బోల్తా పడితే, ఇక ఈ డైరక్టర్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు చూడానికి ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చ. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.