హిందీ మార్కెట్ నుంచి స్ట్రైట్ సినిమాలకు.. గోల్డ్ మైన్ భారీ ప్లాన్!
సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో గోల్డ్ మైన్ మూవీస్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
By: Tupaki Desk | 29 Jan 2025 2:30 PM GMTసౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో గోల్డ్ మైన్ మూవీస్ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా ఈ సంస్థ ఇప్పటికే భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంది. పలు ఫ్లాప్ తెలుగు సినిమాలకు కూడా నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. యూట్యూబ్ లో విడుదల చేసే సౌత్ హిందీ డబ్బింగ్ సినిమాలకు వందల మిలియన్స్ వ్యూవ్స్ వస్తుంటాయి.
దాదాపు 90% సౌత్ సినిమాల హిందీ రైట్స్ గోల్డ్ మైన్స్ సొంతం చేసుకుంటోంది. రామ్, గోపిచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోల హిందీ డబ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా దక్షిణాది యాక్షన్ సినిమాలను హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది. డబ్ సినిమాలతో మార్కెట్‌ను ఏలుతున్న ఈ సంస్థ ఇప్పుడు కొత్త దారిలో నడవబోతోందని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇప్పటికే డబ్ సినిమాలతో భారీ లాభాలు గడించిన గోల్డ్ మైన్ మూవీస్, ఇప్పుడు స్ట్రైట్ సినిమాలపై దృష్టిపెట్టింది. ఒక్కసారిగా 17 కొత్త సినిమాలను నిర్మించేందుకు ఈ సంస్థ భారీ ప్రణాళికలు రచించిందని సమాచారం. అందుకు అవసరమైన కథలు కూడా సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రెండు చిత్రాల్లో లారెన్స్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని టాక్. ఇందులో ముఖ్యంగా కాంచన 4 చిత్రాన్ని లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, మరొక చిత్రంగా కాలభైరవ అనే ప్రాజెక్ట్‌కు రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా, మరో నాలుగు సినిమాలకు కథలు రెడీ అయ్యాయి. హీరోల కాస్టింగ్ మాత్రమే పూర్తయితే వెంటనే షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో హిందీ మార్కెట్‌లో డబ్ సినిమాలతో సత్తా చాటిన గోల్డ్ మైన్, ఇప్పుడు స్ట్రైట్ సినిమాల ద్వారా కూడా అదే విజయాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సంస్థ దృష్టి ఎక్కువగా దక్షిణాది హీరోలపై ఉందని టాక్. వీటితో పాటు మరో పదకొండు సినిమాలను కూడా నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది.
ఒకే సమయంలో 17 సినిమాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం సినీ పరిశ్రమలో ఎంతో అరుదుగా కనిపించే విషయమే. గతంలో తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అటువంటి ప్రయోగాలు చేసింది. తక్కువ సమయంలో వంద సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్లిన ఈ సంస్థ, ఇప్పుడు భారీ స్థాయిలో పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇప్పుడు గోల్డ్ మైన్ కూడా అదే విధంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులను ప్రారంభించబోతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సౌత్ ఇండస్ట్రీలో హిట్ అయిన కథలు, కమర్షియల్ సినిమాలు బాలీవుడ్‌లో సైతం పెద్ద హిట్స్ అవుతాయనే నమ్మకంతో గోల్డ్ మైన్ ముందుకు వెళ్తోంది. గతంలో హిందీ మార్కెట్‌ను ఆసరాగా తీసుకుని పెద్ద విజయాలను అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు స్ట్రైట్ సినిమాలతో మరో సక్సెస్ ఫార్ములా సాధిస్తుందా? లేదా అనేది చూడాల్సిన అంశం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలను గోల్డ్ మైన్ సంస్థ అధికారికంగా ప్రకటించనుంది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.