గూగుల్ ట్రెండ్స్.. హనుమాన్ ఫుల్ జోష్..
ఊహించని రీతిలో పాన్ ఇండియా లెవెల్ లో అందర్నీ మెప్పించి అబ్బురపరిచింది.
By: Tupaki Desk | 11 Dec 2024 4:22 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద విజయం సాధించింది. 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచి.. భారీ వసూళ్లను రాబట్టింది. మేకర్స్ కు వేరే లెవెల్ లాభాలు అందించింది. ఊహించని రీతిలో పాన్ ఇండియా లెవెల్ లో అందర్నీ మెప్పించి అబ్బురపరిచింది.
సంక్రాంతి బరిలో దిగిన మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ సినిమాలతో పోటీ పడి మరీ హనుమాన్ చిత్రం సత్తా చాటింది. 90 ఏళ్ల సంక్రాంతి సీజన్ సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనే కాదు.. హిందీలో కూడా అదరగొట్టింది.
సూపర్ హీరో కాన్సెప్ట్ కు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన హనుమాన్ మూవీ థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీలో కూడా దుమ్ము రేపింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. అక్కడ స్టాండింగ్ ఒవేషన్ ను అందుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటి చెప్పింది.
ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తెరకెక్కుతోంది. కన్నడ యాక్టర్ రిషభ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హనుమంతుడిగా సినిమాలో కనిపించనున్నారు. తేజ సజ్జ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించినా.. ఆ తర్వాతే విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే హనుమాన్ మూవీ.. తాజాగా అరుదైన ఘనత సాధించింది. ఆ విషయాన్ని గూగుల్.. గౌరవంగా ప్రకటించింది. 2024 ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తి కానుండటంతో గూగుల్ టాప్ 10 Near me సెర్చులను రివీల్ చేసింది. ఆ లిస్ట్ లో పదో స్థానంలో "Hanuman Movie Near Me" ఉంది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతకుముందు.. 2024లో ఎక్కువ మంది ఏ మూవీ కోసం సెర్చ్ చేశారన్న లిస్టులో కూడా హనుమాన్ స్థానం సంపాదించుకుంది. ఐదో స్థానంలో హనుమాన్ మూవీ ఉంది. హనుమాన్ తో పాటు కల్కి 2898 ఏడీ, సలార్ సినిమాలు కూడా టాప్ 10 మోస్ట్ సెర్చ్డ్ మూవీస్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. మొత్తానికి హనుమాన్ మూవీ.. గూగుల్ ట్రెండ్స్ లో సత్తా చాటినట్లే.