Begin typing your search above and press return to search.

సినిమా రిజల్ట్ నే మార్చేస్తున్న గూస్‌బంప్స్ మూమెంట్స్!

ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ మూవీ ఫెయిల్ అవుతుందో తలపండిన సినీ పండితులు కూడా చెప్పలేరు

By:  Tupaki Desk   |   3 July 2024 7:54 AM GMT
సినిమా రిజల్ట్ నే మార్చేస్తున్న గూస్‌బంప్స్ మూమెంట్స్!
X

ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో, ఏ మూవీ ఫెయిల్ అవుతుందో తలపండిన సినీ పండితులు కూడా చెప్పలేరు. ఒక సినిమా హిట్టవ్వడానికి లేదా ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకుల నాడిని పట్టుకొని, సినిమాలో అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నవారికే విజయం వరిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక్క సీన్ లేదా ఒక్క సాంగ్ లేదా ఒక్క ఫైట్.. సినిమా స్థితి గతులనే మార్చేస్తున్నాయి. సినిమా మొత్తం ఎలా ఉన్నా, గూస్‌బంప్స్ తెప్పించే ఒక్క ఎపిసోడ్ హైలైట్ అయ్యేలా చూసుకుంటే చాలు.. సినీ అభిమానులు దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు.

సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హీరో 'హను-మాన్' చిత్రాన్నే తీసుకుంటే.. సినిమా అంతా ఓకే కానీ, చివర్లో వచ్చిన గూజ్ బంప్స్ మూమెంట్సే ఆ రేంజ్ సక్సెస్ కు కారణమయ్యాయి. క్లైమాక్స్ లో తేజ సజ్జాకి ఆంజనేయ స్వామి దర్శనమిచ్చే సన్నివేశం ఒళ్ళు పులకరించేలా చేస్తుంది. అప్పటి వరకూ నార్మల్ గా సాగిపోతున్న సినిమాని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లి, అదే ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్లలో నుంచి బయటకు వచ్చేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ, ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందూ పురాణాలను సైన్స్ కు ముడిపెడుతూ ఈ ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. నిజానికి ఈ మూవీకి ఇనానిమస్ గా పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. ఫస్టాఫ్ అంతా డల్ గా ఉందని, బోరింగ్ గా అనిపించిందని, హై ఇచ్చే ఒక్క సీన్ కూడా హీరో ప్రభాస్ కు పడలేదనే కామెంట్లు వచ్చాయి. సెకండాఫ్ ను కూడా ఏదో అమితాబ్ బచ్చన్ తో లాగించేస్తున్నారు అని అనుకుంటుండగా.. చివరి 30 నిమిషాల్లో ప్రభాస్‌ పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ఇదే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది.

'కల్కి' సినిమా మొత్తం ఒక ఎత్తయితే, క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. అప్పటి వరకూ బౌంటీ హంటర్‌గా కనిపించిన ప్రభాస్‌.. ఒక్కసారిగా మహాభారతంలో కర్ణుడిగా కనిపించి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. 'ఆలస్యమైందా ఆచార్య పుత్రా' అంటూ కురుక్షేత్రంలో ప్రభాస్‌ విల్లు ఎక్కుపెట్టి రథం మీద నిలబడితే, థియేటర్ లో ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుసుకుంటున్నాయి. అలానే చివర్లో సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ తన విశ్వరూపాన్ని చూపించే ఎపిసోడ్ కూడా బాగా హైలైట్ అయింది. ఈ అంశాలే 'కల్కి' పార్ట్-2 పై అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

గూస్ బంప్స్ తెప్పించే ఎపిసోడ్స్, హై ఇచ్చే మూమెంట్స్ క్రియేట్ చెయ్యడంలో ఎస్.ఎస్ రాజమౌళిని కొట్టే దర్శకుడే లేడని అనడంలో అతిశయోక్తి లేదు. 'బాహుబలి 1'లో ప్రభాస్ తన భుజాన శివ లింగాన్ని మోసుకొని నదిని దాటే సీన్.. ప్రభాస్ కాలుని కట్టప్ప సత్యరాజ్‌తన నెత్తిన పెట్టుకుంటూ 'బాహుబలి' అంటూ గట్టిగా అరిచే సన్నివేశాలు ఆడియన్స్ ను భావోద్వేగానికి గురి చేస్తాయి. అలానే 'బాహుబలి 2'లో 'అమరేంద్ర బాహుబలి అనే నేను' అంటూ మాహిష్మతి సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సీన్‌ సినిమా మొత్తానికే హైలైట్‌ అని చెప్పాలి. RRR చిత్రంలో 'నాటు నాటు' పాట, రామ్ చరణ్ ఎంట్రీ, ఎన్టీఆర్ పులిని బంధించే సన్నివేశాలు థియేటర్ లో మంచి హై ఇచ్చాయి.

కృష్ణతత్వం, ద్వారకా నగరం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో డైరెక్టర్ చందు మొండేటి 'కార్తికేయ 2' చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా అంతా మామూలుగానే ఉంటుంది కానీ, అనుపమఖేర్ శ్రీ కృష్ణుడి గొప్పదనాన్ని వివరించే ఎపిసోడ్ మాత్రం హైలైట్‌ గా నిలిచింది. మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సినీ విశ్లేషకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఒక్కటి క్లిక్ అవ్వడంతో ఈ సినిమా రిజల్టే మారిపోయింది. 'సలార్' సినిమాలో కాటేరమ్మ ఫైట్, ఖాన్సార్‌ కా సలార్‌.. అంటూ శ్రియా రెడ్డి హీరో ప్రభాస్‌ పాత్రకు బిల్డప్ ఇచ్చే సీన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ విధంగా ఇటీవల కాలంలో హిట్టైన మరికొన్ని సినిమాల్లో మాంచి హై ఇచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ హైలైట్‌ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇది గ్రహించి రాబోయే సినిమాల్లో మన దర్శక రచయితలు మరిన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ తో జనాలను థ్రిల్ చేస్తారేమో చూడాలి.