తండ్రి నటనకు కొడుకు గొంతు!
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణకు చాలా ఆలస్యంగా సినిమాల్లో మంచి గుర్తింపు అందింది.
By: Tupaki Desk | 4 Feb 2025 11:18 AM GMTసినీ పరిశ్రమలో ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు సడెన్ గా వెలుగులోకి వస్తాయి. కొన్ని విషయాలు అసలెప్పటికీ బయటకు కూడా రావు. మరికొన్ని సందర్భం వచ్చినప్పుడు అనుకోకుండా బయటపడతాయి.
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణకు చాలా ఆలస్యంగా సినిమాల్లో మంచి గుర్తింపు అందింది. ఈ సినిమాలో ఆయన నటనకు అభిమానులవని వారంటూ ఉండరు. ఇన్ని రోజులు ఇంత టాలెంటెడ్ నటుడిని గుర్తించలేదని ఇండస్ట్రీ మొత్తం తెగ ఫీలైంది ఆయన విషయంలో.
ఈ నేపథ్యంలోనే ఆయనకు పలు సినిమాల్లో వరుస ఆఫర్లొచ్చాయి. గత నాలుగైదేళ్లలోనే చాలా ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశాడు. కానీ రీసెంట్ గా ఆయన ఆరోగ్యం బాలేక హాస్పత్రి పాలయ్యారు. రమణకు బైపాస్ సర్జరీ జరిగడంతో కొన్ని నెలలుగా సినిమాలు చేయకుండా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఆయన నటించిన పలు సినిమాలకు సైతం డబ్బింగ్ కూడా చెప్పలేకపోయాడు. దీంతో దర్శకనిర్మాతలకు అది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఆయనకు గొంతే పెద్ద ఎస్సెట్. అలాంటి ఆయనకు వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే అసలు సూట్ అవకపోగా ఆ పాత్ర నెగిటివ్ గా మారే ఛాన్సుంది.
అందుకే గోపరాజు రమణతో పూర్తి చేసిన సినిమాలకు ఆయన కొడుకు గోపరాజు విజయ్ తో డబ్బింగ్ చెప్పించారట. ఈ విషయం ఇప్పుడు చాలా లేట్ గా వెలుగులోకి వచ్చింది. గోపరాజు విజయ్ కూడా నటుడే అవడం, ఆయనది కూడా మంచి బేస్ వాయిస్ అవడం, తండ్రి గొంతుకు దగ్గరగా ఉండటంతో విజయ్ తో తన తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది.
కమిటీ కుర్రాళ్లు, స్వాగ్ సహా 5 సినిమాల్లోని రమణ వాయిస్‌కు కూడా విజయే డబ్బింగ్ చెప్పాడట. తండ్రీ కొడుకులవడం, వాయిస్ కూడా చాలా సిమిలర్ గా ఉండటం వల్ల ఎవరికీ డౌట్ రాలేదు. ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్న గోపరాజు రమణ పూర్తిగా కోలుకున్న తర్వాత కానీ సినిమాల్లో నటించే ఛాన్స్ లేదు.