Begin typing your search above and press return to search.

ఈసారి సీనియర్లను నమ్మలేక..

టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్, ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:30 PM GMT
ఈసారి సీనియర్లను నమ్మలేక..
X

టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్, ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 'విశ్వం' డీసెంట్ అంచనాలతో వచ్చినప్పటికి ఇది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో గోపీచంద్ నిరాశలో ఉన్నాడు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోవడంతో అతని మార్కెట్ సందిగ్ధంలో పడింది. గోపీచంద్ కెరీర్‌లో 'సౌఖ్యం' ఆయనకు చివరి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత వచ్చిన 'సీటీమార్' మాత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక 'భీమా', 'రామబాణం' వంటి సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య విడుదలై, పెద్దగా వసూళ్లు సాధించలేకపోయాయి.

లేటెస్ట్ మూవీ 'విశ్వం'పై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా, దానికీ అదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి స్థితిలో గోపీచంద్ తన కెరీర్‌ ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకోవాలి అని కొత్త దర్శకులతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ తన రాబోయే సినిమాలపై మాట్లాడాడు. "నేను గత కొంత కాలంగా ప్రయాణిస్తున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయబోతున్నాను. వారు చెప్పిన కథలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి," అని చెప్పాడు గోపీచంద్.

వాటిలో ఒక సినిమాను UV క్రియేషన్స్ నిర్మిస్తుండగా, మరోదాన్ని SVCC బ్యానర్‌పై బాపినీడు నిర్మిస్తున్నారు. గోపీచంద్ కొత్త దర్శకులతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగాత్మక ప్రయత్నం అతనికి ఎంత మేరకు సక్సెస్ అందిస్తుందో చూడాలి. మరోవైపు, గోపీచంద్ జిల్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్‌తో కలిసి పనిచేయనున్నట్లు కూడా గతంలో టాక్ వచ్చింది. గతంలో జిల్ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌గా నిలవడంతో, ఈ కాంబినేషన్‌పై కూడా ప్రేక్షకుల్లో హైప్ ఉంది.

అయితే గోపీచంద్ చెప్పినట్టు, కొత్త దర్శకులతో కలిసి ఈసారి వచ్చే సినిమాలు అతని కెరీర్‌కి కొత్త దిశలో మార్పు తీసుకురావాలని అతను ఆశిస్తున్నాడు. తాజా పరిస్థితుల్లో, తెలుగు సినిమాల్లో కొత్త తరం దర్శకులు సరికొత్త పంథాలో సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. కెరీర్ మొదట్లో కూడా గోపిచంద్ ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. శౌర్యంతో శివ, రణం సినిమాతో అమ్మా రాజశేఖర్, లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకులుగా మారిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు గోపీచంద్, కొత్త దర్శకులతో చేసే ప్రయోగాలు ఎంత మేరకు పాజిటివ్ ఫలితాలు అందిస్తాయో వేచి చూడాలి.