గోపీచంద్ 33.. 7వ శతాబ్దానికి వెళ్ళనున్న మాస్ హీరో!
శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
By: Tupaki Desk | 10 March 2025 1:09 PM ISTటాలీవుడ్ మాస్ హీరో గోపీచంద్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించాడు. వరుసగా మాస్, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈసారి సరికొత్త జోనర్‌లో అడుగుపెట్టనున్నాడు. టెక్నికల్‌గా అద్భుతమైన కథలను ఎంచుకునే దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి ఓ భారీ పీరియాడికల్ డ్రామా చేయబోతున్నాడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
గోపీచంద్ 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 7వ శతాబ్దానికి చెందిన ఓ ఆసక్తికరమైన చారిత్రక సంఘటన ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పటికే 'ఘాజీ', 'IB71' వంటి సినిమాలతో తన సాంకేతిక నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను కూడా విభిన్నమైన కథ, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
గోపీచంద్ కెరీర్‌లో ఇదొక కొత్త ప్రయోగమని, ఇప్పటి వరకు ఆయన చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడని మేకర్స్ తెలిపారు. సినిమా లాంచ్ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసింది. మాస్ హీరో గోపీచంద్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని, ఈసారి గెటప్ కూడా పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
పీరియాడికల్ నేపథ్యంలో టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే ఈ సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘సైరా’, ‘రుద్రంగి’, ‘హనుమాన్’ లాంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ కూడా అలాంటి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.
మేకర్స్ ఇప్పటికే భారీ బడ్జెట్‌ను కేటాయించారని, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో పని చేయనున్నారని సమాచారం. ఈ సినిమా గురించి దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ, "ఇప్పటి వరకు సినిమా తెరపై చూడని ఓ భారతీయ చారిత్రక సంఘటనను అత్యద్భుతంగా చూపించబోతున్నాం. ప్రేక్షకులు ఖచ్చితంగా కొత్త అనుభూతిని పొందేలా కథను మలిచాం" అంటూ చెప్పుకొచ్చాడు.
గోపీచంద్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా కీలకంగా మారనుందని, ఆయన పాత్ర కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. మరి 7వ శతాబ్దం కథతో గోపీచంద్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.