Begin typing your search above and press return to search.

'భీమా' భాయ్ ప్లాన్‌ ఏంటి..?

గత ఏడాది భీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించలేదు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:44 AM GMT
భీమా భాయ్ ప్లాన్‌ ఏంటి..?
X

గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మ్యాచో హీరో గోపీచంద్ సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. గత ఏడాది భీమా, విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మధ్య తన 'జిల్‌' చిత్ర దర్శకుడు రాధాకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌ సినిమాను రూపొందించి తీవ్రంగా నిరాశ పరచిన దర్శకుడు రాధాకృష్ణ మరో బ్యూటీఫుల్‌ స్టైలిష్ సినిమాను గోపీచంద్‌తో మీడియం బడ్జెట్‌లో తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, యూవీ క్రియేషన్స్‌లో ఆ సినిమా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది.

ఇప్పటి వరకు ఆ సినిమా విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. గోపీచంద్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. ఏడాదికి ఒక్కటి చేసినా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు. రాధాకృష్ణ దర్శకత్వంలోనే కాకుండా మరో రెండు సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాను గోపీచంద్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. గతంలో వీరి కాంబోలో సీటీమార్‌ సినిమా వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. కనుక మరోసారి వీరి కాంబో మూవీని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం సంపత్‌ నంది చేస్తున్న సినిమా పూర్తి అయి విడుదల అయిన తర్వాత కొత్త సినిమా ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. దానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌, సంపత్ నంది కాంబోలో మూవీ ఎప్పటి వరకు కార్యరూపం దాల్చనుంది అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. గోపీచంద్‌ మరో దర్శకుడితోనూ చర్చలు జరిపారనే వార్తలు వస్తున్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు.

ఘాజి, అంతరిక్షం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన సంకల్ప్‌ రెడ్డి ఆ మధ్య గోపీచంద్‌కి ఒక పీరియాడిక్‌ డ్రామా కథను చెప్పాడని తెలుస్తోంది. ఈ మూడు సినిమాల కథల విషయంలోనూ గోపీచంద్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే మూడు సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే మొదట గోపీచంద్‌ మొదలు పెట్టబోతున్న సినిమా ఏది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. రాధాకృష్ణ, సంకల్ప్‌ రెడ్డిలు ప్రస్తుతం సినిమాలు చేయకుండా స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. కనుక వారిద్దరిలో ఒకరితో గోపీచంద్‌ తదుపరి సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన గోపీచంద్‌ ఈ ఏడాది ఒక్క సినిమా అయినా విడుదల చేసేనా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.