Begin typing your search above and press return to search.

ఎప్పుడూ అదే రొటీన్ ఫార్ములా సినిమాలేనా గోపీ?

2001లో 'తొలి వలపు' సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. వెంటనే 'జయం' చిత్రంతో విలన్ అవతారమెత్తారు

By:  Tupaki Desk   |   10 March 2024 3:00 AM GMT
ఎప్పుడూ అదే రొటీన్ ఫార్ములా సినిమాలేనా గోపీ?
X

2001లో 'తొలి వలపు' సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. వెంటనే 'జయం' చిత్రంతో విలన్ అవతారమెత్తారు. ఆ తర్వాత 'నిజం' 'వర్షం' సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. 'యజ్ఞం' మూవీతో మళ్లీ కథానాయకుడిగా మారి సక్సెస్ అందుకున్నారు. ఇక అప్పటి నుంచీ మాస్ యాక్షన్ సినిమాలే చేసుకుంటూ వస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ ఉన్న మ్యాచో స్టార్.. ఎక్కువ శాతం అదే రొటీన్ మాస్ మసాలా చిత్రాలే చేస్తుండటంతో అభిమానుకలు కాస్త నిరాశ చెందుతున్నారు.

గోపీచంద్ ఎంత మంచి నటుడనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ లో 'ఆంధ్రుడు' 'రణం' 'ఒక్కడున్నాడు' 'గోలీమార్' 'సాహసం' 'లక్ష్యం' 'లౌక్యం' వంటి హిట్లు ఉన్నాయి. వీటి ద్వారానే తనకంటూ ఓ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా గోపీ ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద యావరేజ్ గా మిగిలిపోతున్నాయి. దీనికి కారణం కమర్షియాలిటీ పేరుతో రోటీన్ కథలే చేస్తుండటమే అనే కామెంట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'భీమా' సైతం ఇదే కోవకు చెందుతుందని అంటున్నారు.

సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్‌.. మహా శివరాత్రికి 'భీమా' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇందులో హీరో రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి పోలీస్ క్యారెక్టర్ అని ప్రమోషనల్ కంటెంట్ తోనే క్లారిటీ వచ్చేసింది. పోలీస్ స్టోరీలు, మాస్ పాత్రలు గోపిచంద్‌ కి కొత్తేమీ కాదు. కానీ ఈసారి పురాణ నేపథ్యం, సెమీ ఫాంటసీ అంశాలను జోడిస్తున్నట్లు చెబుతూ వచ్చారు. అయితే తీరా థియేటర్లలో సినిమా చూశాక ఇదొక రొటీన్ కథ అని ఆడియన్స్ నిట్టూర్చారు. ఆ కథకు సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ సెట్ అవ్వలేదని.. మళ్లీ అదే ఓల్డ్ ఫార్ములా సన్నివేశాలతో నిరుత్సాహపరిచారని అంటున్నారు.

'భీమా' సినిమాలో యాక్షన్ సీన్స్ లో గోపీచంద్ ఎప్పటిలాగే అదరగొట్టారు. మంచి హై ఇచ్చే సీన్స్ పడితే స్క్రీన్ మీద ఎలా చెలరేగిపోతాడనేది కొన్ని సన్నివేశాల్లో చూపించారు. కానీ ఎంత చేసినా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అనిపించుకోవడం లేదు. ఇలాంటివి 'బి', 'సి' మాస్ సెంటర్స్ ఆడియెన్స్ మాత్రమే చూడగలుగుతారు. రొటీన్ మాస్ మసాలా కంటెంట్ కావడంతో 'ఎ' సెంటర్స్, మల్టీఫ్లెక్స్ జనాలు కనెక్ట్ కాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా ట్రెండ్ మొదలయిన తర్వాత అన్ని భాషల్లోనూ ఇప్పుడు కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు. ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు వైవిధ్యమైన కంటెంట్ తో వస్తేనే ఆదరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి రకరకాల చిత్రాలు వస్తున్నాయి. మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి హీరోలే విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. కానీ గోపీచంద్ లాంటి మంచి పొటెన్షియల్ యాక్టర్ మాత్రం ఎందుకు ఇంకా అదే రొటీన్ ఫార్ములాలో ఉండిపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గోపీచంద్ ఒకటే తరహా సినిమాలు చేయడం వల్ల ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంచి కేపబుల్ ఉన్న యాక్టర్ ను మిస్ అవుతోందనే చెప్పాలి. ఒక్కసారి ఆయన ఆ జోన్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ కంటెంట్ మూవీస్ చేస్తే, కచ్ఛితంగా బ్లాక్ బస్టర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. కానీ గోపీచంద్ ఆ దిశగా ఆలోచన చేయడం లేదని అభిమానుల సైడ్ నుంచే కామెంట్లు వస్తున్నాయి. మరి ఫ్యాన్స్ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని మ్యాచో స్టార్ ఇప్పటి నుంచైనా రొటీన్ కథలను పక్కన పెట్టి, కొత్త తరహా సినిమాలు చేస్తారేమో చూడాలి.