విడాకుల వార్తలపై స్పందించిన స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో గోవింద తన భార్య సునీతా అహుజా నుంచి 37 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలనుకుంటున్నారని కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 26 Feb 2025 6:31 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో గోవింద తన భార్య సునీతా అహుజా నుంచి 37 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలనుకుంటున్నారని కథనాలొచ్చాయి. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని గోవిందా మేనకోడలు ఆర్తి ఈ మంగళవారం నాడు స్పష్ఠత నిచ్చారు. అయితే గోవిందా కానీ, శ్రీమతి సునీత కానీ దీనిపై స్పందించలేదు.
ఇటైమ్స్ తాజా ఇంటర్వ్యూలో గోవిందా విడాకుల వార్తలపై స్పందించారు. డీటెయిలింగ్ లేకుండానే క్లుప్తంగా సమాధానమిచ్చారు. ``బిజినెస్ చర్చలు మాత్రమే జరుగుతున్నాయి... నేను నా సినిమాలు ప్రారంభించే పనిలో ఉన్నాను`` అని అన్నారు. అయితే ఈ వార్తలపై సునీతను జాతీయ మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించినా తన నుంచి సమాధానం లేదని సదరు కథనం పేర్కొంది.
గోవింద మేనేజర్ శశి సిన్హా మాట్లాడుతూ- ``కుటుంబంలోని కొందరు సభ్యులు చేసిన కొన్ని ప్రకటనల కారణంగా దంపతుల మధ్య సమస్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దానికి మించి ఏమీ లేదు. గోవింద తదుపరి సినిమాని ప్రారంభించే పనిలో ఉన్నారు. దాని కోసం కళాకారులు మా కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. మేము దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం`` అని తెలిపారు.
గోవిందా- సునీత అహూజా జంట కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో సునీతా అహుజా తమ వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత ఈ జంట విడిపోతున్నారని పుకార్లు వచ్చాయి. నా తదుపరి జీవితంలో అతను నా భర్త కాకూడదని నేను అతడికి చెప్పానని సునీత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. భర్తతో సరదాగా సాయంత్రాలు గడపాలనుంటుందని, కానీ అతడు ఎప్పుడూ వ్యాపారం ముచ్చట్లు, స్నేహితులతో ముచ్చట్లలో బిజీగా ఉంటాడని సునీత అహూజా తెలిపారు.
అయితే సునీత కొన్ని నెలల క్రితం విడిపోవడానికి నోటీసు పంపినట్లు కూడా జాతీయ మీడియాల్లో కథనాలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గోవింద -సునీతా అహుజా మార్చి 1987లో వివాహం చేసుకున్నారు. 1988లో తమ కుమార్తె టీనాను స్వాగతించాక ఈ జంట తమ వివాహాన్ని ప్రకటించారు. తరువాత వారికి 1997లో యశ్వర్ధన్ అనే కుమారుడు జన్మించాడు.