దర్శకుడికి గ్రోక్ క్షమాపణ.. ఇంకా ఎన్ని దారుణాలు..!
ఈమధ్య కాలంలో ఏఐ అనే రెండు అక్షరాల పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నో టెక్ కంపెనీలు ఈ ఏఐ ను తీసుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 21 March 2025 6:40 AMఈమధ్య కాలంలో ఏఐ అనే రెండు అక్షరాల పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నో టెక్ కంపెనీలు ఈ ఏఐ ను తీసుకు వస్తున్నాయి. ఇటీవల ఎక్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఏఐ టూల్ 'గ్రోక్'. ఏ భాషలో అడిగినా, ఎలాంటి విషయాన్ని అడిగినా అర్థం అయ్యే విధంగా సరళ పదాలతో గ్రోక్ సమాధానాలు ఇస్తుంది అంటూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇంతలోనే గ్రోక్ ఒక వివాదంలో చిక్కుకుంది. గ్రోక్ లో ఒక నెటిజన్ తప్పుడు వార్తలు సృష్టించే వారి జాబితాలో ప్రముఖ దర్శకుడి పేరు చేర్చడంతో వివాదం మొదలైంది. ఆ దర్శకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో గ్రోక్ సంస్థ నుంచి ఆ దర్శకుడికి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ఇక్కడితో ముగిసిన ఇంకా ముందు ముందు ఎన్ని దారుణాలు చూడాలో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, గ్రోక్ వివాదం వివరాల్లోకి వెళ్తే... ఇటీవల బాగా వైరల్ అవుతున్న గ్రోక్ ఏఐ టూల్‌లో తప్పుడు వార్తలు సృష్టించే వారి పేర్లను అడిగిన సమయంలో వివేక్ అగ్నిహోత్రి పేరును అందులో చూపించింది. సోషల్ మీడియాలో దర్శకుడు తప్పుడు వార్తలు సృష్టిస్తాడంటూ గ్రోక్ చూపించిన ఫలితంపై ఒక్కసారిగా దుమారం రేగింది. తన ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా గ్రోక్ వ్యవహరించిందని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గ్రోక్ నుంచి వెంటనే స్పందన రావాలని, తనకు క్షమాపణలు చెప్పాలని దర్శకుడు డిమాండ్ చేశాడు. గ్రోక్ పోస్ట్ నేపథ్యంలో కొందరు వ్యక్తులు తనపై తప్పుడు నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గ్రోక్‌లో తన గురించి తప్పుడు పోస్ట్ కారణంగా తీవ్ర మనోక్షోభకు గురి అయినట్లు ఆయన పేర్కొన్నాడు. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు సైతం దీని కారణంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. చాలా సంవత్సరాలుగా పలు సినిమాలను రూపొందించి ప్రేక్షకులకు ఎన్నో కొత్త విషయాలను చెబుతూ ఉన్న తనపై ఇలాంటి కామెంట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, దీనికి తాను బహిరంగ క్షమాపణ ఆశిస్తున్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. వివేక్ కి మద్దతుగా పలువురు గ్రోక్‌పై విమర్శలు చేస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది మొత్తం వ్యవస్థను నాశనం చేసే ప్రమాదం ఉందని, దీనికి గ్రోక్ సమాధానం చెప్పి తీరాలంటూ నెటిజన్స్ స్పందించారు.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై వివాదాస్పద పోస్ట్‌కి గ్రోక్ క్షమాపణలు చెప్పింది. కచ్చితంగా ఇది పెద్ద తప్పు. తమకు ఉన్న సోర్స్ ఆధారంగా ఆ జాబితాలో చేర్చింది. ఇకపై అలాంటివి జరగవు. వాస్తవాలను గుర్తించి ఇకపై సమాధానాలు అందిస్తామని గ్రోక్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇతరుల ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఎలాంటి పనులు ఇకపై మా నుంచి జరగవని హామీ ఇస్తున్నాం. అసౌకర్యం కలిగించినందుకు గాను మీకు, మీ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాం. ఇలాంటి ఏఐ టూల్స్‌ను గుడ్డిగా నమ్మవద్దని, ముందు ముందు కూడా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని గ్రోక్ ఇచ్చే అకవాశాలు ఉన్న కారణంగా అవసరాన్ని మించి ఈ టూల్‌ను వాడకూడదని, అంతే కాకుండా దీనిలో లభించిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని నిపుణులు చెబుతున్నారు.