Begin typing your search above and press return to search.

ఆ ఒక్క థియేటర్ లో.. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్.. మహేశ్ బాబుకు రాజకోటగా భావిస్తారు ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   29 Jan 2024 9:35 AM GMT
ఆ ఒక్క థియేటర్ లో.. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్
X

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్.. మహేశ్ బాబుకు రాజకోటగా భావిస్తారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ నటించిన సినిమాలను సుదర్శన్ థియేటర్‌ లోనే చూడాలని అభిమానులు అనుకుంటారు. అక్కడ మహేశ్ సినిమాకు జరిగే సెలబ్రేషన్స్ మరెక్కడా కనిపించవు. అందుకే ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మహేశ్ బాబు ఫ్యామిలీ కూడా పలు మూవీ రిలీజ్‌ లకు అక్కడికి వచ్చి అభిమానులతో ఎంజాయ్ చేస్తారు.

ఇటీవలే సంక్రాంతి కానుకగా రిలీజైన గుంటూరు కారం మూవీని కూడా మహేశ్ ఫ్యామిలీ.. సుదర్శన్ థియేటర్లోనే చూసింది. సతీమణి నమ్రతతో కలిసి మహేశ్.. ఫ్యాన్స్ మధ్యలో సినిమాను వీక్షించారు. ఈ థియేటర్లో ఆడిన మహేశ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి! తాజాగా గుంటూరు కారం మూవీ ఓ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది.

సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం మూవీ.. 17 రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. మహేశ్ బాబుకు ఈ థియేటర్ ఎందుకంత స్పెషలో ఈ చిత్రం మరోసారి నిరూపించింది. సుదర్శన్ 35 ఎంఎంలో రూ.కోటికిపైగా గ్రాస్ వసూలు చేసిన ఏడో సినిమా ఇది.

గతంలో మురారి (రూ.1.2 కోట్లు), ఒక్కడు (రూ.1.47 కోట్లు), అతడు (రూ.1.04 కోట్లు), పోకిరి (రూ.1.61 కోట్లు), మహర్షి (రూ.1 కోటి), సరిలేరు నీకెవ్వరు (రూ.1.06 కోట్లు) సినిమాలు కూడా రూ.కోటి కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే వీటన్నింటిలో గుంటూరు కారం మూవీ మాత్రం అత్యంత వేగంగా కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

గుంటూరు కారం మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అనేక చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీలో మహేశ్ బాబుతోపాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ ఇది. ప్రస్తుతం సూపర్ స్టార్ రాజమౌళి సినిమా కోసం మహేశ్ రెడీ అవుతున్నారు.