మహేష్- త్రివిక్రమ్ క్రేజ్ కాపాడేస్తుందా?
వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాల్లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్, ఎక్కువ క్రేజ్ ఉన్నది గుంటూరు కారం అనడంలో సందేహం లేదు
By: Tupaki Desk | 21 Dec 2023 3:00 AM GMTవచ్చే సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాల్లో అత్యంత పెద్ద ప్రాజెక్ట్, ఎక్కువ క్రేజ్ ఉన్నది గుంటూరు కారం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన మహేష్ బాబు ఇందులో హీరో. ఇక దర్శకుడు త్రివిక్రమ్ స్థాయి ఏంటో కూడా తెలిసిందే. ఇలాంటి కలయికలో సినిమా అంటే ఉండే క్రేజే వేరు. ఐతే క్రేజీ కాంబినేషన్లో మొదలైన ఈ సినిమాకు మొదటి నుంచి ప్రమోషన్ల పరంగా ఏది కలిసి రావడం లేదు. సినిమా పట్టాలెక్కడంలో విపరీతమైన ఆలస్యం జరగడం.. పలుమార్లు షూటింగ్ కు బ్రేక్ పడటం.. కాస్ట్ అండ్ క్రూ పరంగా మార్పులు జరగడం.. ఇలాంటి కారణాల వల్ల సినిమా మీద నెగెటివిటీ వచ్చింది. అది చాలదన్నట్లు సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ఇతర ప్రోమోలు కూడా ప్రేక్షకులను అనుకున్నంతగా మెప్పించలేకపోయాయి. అయినా సరే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ క్రేజే సినిమాను బ్లాక్ బస్టర్ చేసేస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.
కానీ సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే గుంటూరు కారం టీం కంగారు పడక తప్పేలా లేదు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈగల్ ట్రైలర్ చూస్తే వారేవా అనిపించేలా ఉంది. కథలో కొత్తదనం, కమర్షియల్ హంగులు.. ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. ఇక నిన్ననే రిలీజ్ అయిన హనుమాన్ ట్రైలర్ చూస్తే ఆ చిన్న సినిమాను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని అర్థమైంది. మరోవైపు వెంకటేష్ మూవీ సైంధవ్ టీజర్ సైతం ఒక రేంజ్ లో పేలింది. దాని ట్రైలర్ కూడా ఇదే స్థాయిలో ఉంటే సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. మరోవైపు అక్కినేని నాగార్జున మూవీ నా సామిరంగ.. రొటీన్ మాస్ మూవీ లాగే కనిపిస్తున్నప్పటికీ సంక్రాంతికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఎంటర్టైనర్ అనిపిస్తోంది. ఇలా సంక్రాంతి రేసులో ఉన్న మిగతా చిత్రాల ప్రమోషనల్ కంటెంట్ గుంటూరు కారంతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది అన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇకముందు అయినా పాటలు, నేపథ్య ఇతర ప్రోమోల విషయంలో గుంటూరు కారం టీం జాగ్రత్త పడాల్సిందే. వేరే సమయంలో అయితే ఓకే కానీ సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో కంటెంట్ పరంగా ఆసక్తి పెంచకుండా కేవలం మహేష్- త్రివిక్రమ్ క్రేజే సినిమాను కాపాడేస్తుందనుకుంటే కష్టమే.