కొందరు నటులు ఆమెను చూసి అభద్రతలోకి!
నాయికా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు సాధించడం అంత సులువు కాదు. హిస్టరీలో అతి కొద్ది మంది నటీమణులకు మాత్రమే ఇది సాధ్యమైంది.
By: Tupaki Desk | 16 March 2025 7:00 AM ISTనాయికా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు సాధించడం అంత సులువు కాదు. హిస్టరీలో అతి కొద్ది మంది నటీమణులకు మాత్రమే ఇది సాధ్యమైంది. కెరీర్ లో పీక్ ని చూసి, దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న కొందరు నటీమణులకు మాత్రమే ఈ తరహా కథాంశాలు సూటయ్యాయి. నేటితరంలో అలాంటి ప్రతిభ ఉందా? అంటే.. దీనికి ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా విశ్లేషణ ఇలా ఉంది.
భవిష్యత్తులో పరిశ్రమను ముందుకు తీసుకెళ్లగల కొంతమంది మేల్ స్టార్స్ గురించి ప్రస్థావిస్తూనే నేటితరంలో మెరుగైన నటీమణులు ఎవరున్నారో కూడా చెప్పాడు. శార్వరి వాఘ్, మేధా శంకర్, ప్రతిభా రంతా, ప్రీతి పాణిగ్రాహి, కని కుస్రుతి వంటి నటీమణుల పేర్లను అతడు ప్రస్థావించారు. యానిమల్ ఫేం త్రిప్తి దిమ్రీపైనా ప్రశంసలు కురిపించాడు. ట్రిప్తీ ఇండీ చిత్రాల నుండి ప్రధాన స్రవంతిలో బాలీవుడ్ కు ఎలా ప్రయాణించిందో వివరిస్తూ ఆయన ప్రశంసించారు. స్వయంగా ట్రిప్తీ దీనిని సాధించిందని అన్నారు. తనను చూసి కొందరు మేల్ స్టార్స్ అభధ్రత ఫీలవుతున్నారని, కలవరపడుతున్నారని కూడా హన్సల్ వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగించింది.
నిజానికి ట్రిప్తికి గుర్తింపునిచ్చింది `యానిమల్`లోని బోల్డ్ పాత్ర. బుల్బుల్, ఖాలా, లైలా మజ్ను చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ ట్రిప్తి మరింత పరిణతి చెందుతోంది. నటిగా మరింత ఎదుగుతోంది.
ఇదిలా ఉంటే స్త్రీ కేంద్రీకృత చిత్రాలు అంతకంతకు తగ్గిపోతున్నాయని కూడా హన్సల్ ఆవేదన చెందారు. కథానాయికలు మహిళా ప్రధాన చిత్రాల్లో నటించినా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకూ వసూళ్లు తెస్తారు? అన్న ప్రశ్న ఇప్పటికీ అలానే ఉందని అన్నారు. పాత కాలపు మనస్తత్వాలు, సోమరితనం గురించి హన్సల్ విమర్శించారు. అయితే ఓటీటీలో నటీమణులు తమను తాము విలక్షణ పాత్రల్లో నిరూపించుకునే అవకాశం ఉంది. కొన్ని పాత్రలు, వెబ్ సిరీస్ ఆద్యంతం నటీమణులే రన్ చేసేలా కీలక పాత్రలను రచయితలు క్రియేట్ చేస్తున్నారు.