హనుమాన్ వసూళ్లు.. ఇలా చెప్తే ఫేక్ అనేది ఉండదుగా!
నైజాం ఏరియాకు గాను ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ ను మైత్రి దక్కించుకోగా.. ఇప్పుడు రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేసింది హనుమాన్.
By: Tupaki Desk | 2 Feb 2024 9:25 AM GMTసంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకుంది. తెలుగు స్టేట్స్ లోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. మూడో వారంలోనూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయే రీతిలో వసూళ్లు రాబడుతోంది.
మరోవైపు, అమెరికాలోనూ అదరగొడుతోంది. ఊహించని స్థాయిలో అక్కడ హనుమాన్ వసూళ్లు పెరిగిపోయాయి. మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ఆ చిత్రం ఇప్పుడు ఏకంగా 5 మిలియన్ డాలర్లుకుపైగా కొల్లగొట్టింది. బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ చిత్రాల తర్వాత ఈ ఘనత అందుకున్న చిత్రం హనుమాన్యే.
ఇక ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి రూ.కోట్లలో లాభాలు సంపాదించింది. నైజాం ఏరియాకు గాను ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ ను మైత్రి దక్కించుకోగా.. ఇప్పుడు రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేసింది హనుమాన్. దీంతో మైత్రి సంస్థ ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉందట. తాజాగా ఈ సంస్థ.. హనుమాన్ కు సంబంధించిన నైజాం వసూళ్ల పూర్తి వివరాలను బయటపెట్టింది. ఆ వివరాలు ఇవే..
రోజులు: 21
షోస్ : 15170
ప్రేక్షకులు : 3337952
షేర్ : రూ.30,65,46,627
జీఎస్టీతో కలిపి షేర్ : రూ.36,17,25,019
మొత్తం గ్రాస్ : రూ. 62,68,39,130
ఈ వివరాలను చూసిన పలువురు నెటిజన్లు.. మైత్రీ పంట పండిందని అంటున్నారు. ఐదు రెట్లు లాభాలు రావడమంటే మామూలు విషయం కాదని చెబుతున్నారు. ఇలా అందరు డిస్ట్రిబ్యూటర్ లు పూర్తి డిటైల్స్ ఇస్తే ఫేక్ ఉండదు కదా అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, ఈ సినిమా సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ఇటీవలే స్టార్ చేశారు ప్రశాంత్ వర్మ.
ఇక హనుమాన్ సినిమాకు అమ్ముడైన ప్రతి టికెట్‌పై రూ.5.. అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందుతుందని చిత్ర బృందం రిలీజ్ కు ముందే ప్రకటించింది. ఇందులో భాగంగానే రూ.2.66 కోట్ల రూపాయలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది. తెలంగాణలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంతోపాటు ఇతర చిన్న ఆలయాలకు కూడా విరాళం అందించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.