అసలైన చోటే.. హనుమాన్ సునామీ
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కేవలం 9 రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా గ్రాస్ దాటిన చిన్న సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 21 Jan 2024 1:33 PM GMTఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో టాలీవుడ్ నుంచి వచ్చిన 'హనుమాన్' ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఏ థియేటర్లో చూసినా జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగిపోతుంది.
సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అయిపోతున్నాయి. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా ప్రతి చోట హనుమాన్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదలై 10 రోజులవుతున్నా కలెక్షన్స్ లో కొంచెం కూడా డ్రాప్ లేదంటే హనుమాన్ ఊచకోత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్ల పరంగా స్టార్ హీరోల రికార్డులన్నీ పటాపంచలు చేసిన హనుమాన్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కేవలం 9 రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా గ్రాస్ దాటిన చిన్న సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రిలీజ్ రోజు హైదరాబాదులో 'హనుమాన్' సినిమాకి ఒకే ఒక్క సింగిల్ స్క్రీన్ ఇచ్చారు. కానీ రిలీజ్ తర్వాత భారీ ప్రేక్షకుదరణ లభించడంతో రోజురోజుకీ థియేటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటివరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ దాటిన సినిమాలు సుమారుగా 55 ఉన్నాయి.
వీటిలో ఎక్కువ శాతం అగ్ర హీరోలవే ఉన్నాయి. కానీ ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, చిన్న బడ్జెట్ తో తెరకెక్కి ఈ అరుదైన ఘనతను కొన్ని సినిమాలు మాత్రమే అందుకున్నాయి. వాటిలో నువ్వే కావాలి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, నువ్వు నేను, గీత గోవిందం, జయం, మనసంతా నువ్వే.. లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలన్నింటికీ కోటి రూపాయల గ్రాస్ రాబట్టడానికి పట్టిన కాలం చాలా ఎక్కువ.
అదే హనుమాన్ విషయానికొస్తే. కేవలం రెండు వారాల లోపే కోటి రూపాయల గ్రాస్ ని సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద హనుమాన్ రిలీజ్ అయిన థియేటర్స్ లో సంధ్యా 70MM నుంచి 53 లక్షల పైగా గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత సప్తగిరి 70MM నుండి 38 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మిగిలిన మొత్తం సంధ్యా 35MM, శాంతి70MM, తారకరామా వంటి థియేటర్స్ నుంచి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రిలీజ్ అయిన రెండు వారాల లోపే కోటి రూపాయల గ్రాస్ అంటే ఫుల్ రన్ లో మరో కోటి రూపాయల గ్రాస్ అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.