'హనుమాన్'లో అయోధ్య సీన్ మిస్...!
సినిమా క్లైమాక్స్ లో ముఖ్యంగా చివరి పది నిమిషాలు హనుమంతుడు వచ్చిన సమయంలో గూస్‌బంప్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 2 Feb 2024 7:55 AM GMTసంక్రాంతికి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా నాల్గవ వారంలోనూ మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ కి కూడా కచ్చితంగా హనుమాన్ సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకంను బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.
చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా కోసం ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాం.. కాని కొన్ని వీలు పడక పోవడం తో చేయలేక పోయాం అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సినిమా క్లైమాక్స్ లో ముఖ్యంగా చివరి పది నిమిషాలు హనుమంతుడు వచ్చిన సమయంలో గూస్‌బంప్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభీషణుడు పిలిచిన సమయంలో హిమాలయాల్లో ధ్యానం లో ఉన్న హనుమాన్ అక్కడ నుంచి రావడం, హీరోను కలవడం చూపించారు. ఆ సమయంలోనే అయోధ్య షాట్స్ ని పెట్టాలని అనుకున్నారట.
అయోధ్య రామాలయం వద్ద దీపాలు వెలిగిస్తూ ఉండగా, పై నుంచి ఆంజనేయుడు వెళ్లి ఆ దీపాలు అన్ని కూడా వాటంతట అవే వెలిగే విధంగా ప్లాన్ చేశారట. అయితే అనుమతులు ఇతర కారణాల వల్ల అది సాధ్యం కాలేదు అంటూ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తెలియజేశాడు.
ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. అలాంటి సమయంలో అయోధ్య ని హనుమాన్ సినిమాలో అయిదు నుంచి పది సెకన్లు చూపించిన కూడా మరో లెవల్ అన్నట్లు ఉండేది. కానీ ప్రేక్షకులు దాన్ని మిస్ అయ్యారు. ప్రశాంత్ వర్మ త్వరలో జై హనుమాన్ మొదలు పెట్టబోతున్నాడు. అందులో అయోధ్య ను చూపిస్తాడేమో చూడాలి.