రోజుకో కొత్త హనుమాన్ వస్తున్నాడుగా!
ముందుగా 'జై హనుమాన్' మూవీలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి
By: Tupaki Desk | 15 Feb 2024 3:55 AM GMTఓ మోస్తరు అంచనాతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'హను-మాన్ '. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది.. టాలీవుడ్ హిస్టరీలోనే ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు సీక్వెల్ గా రాబోతున్న 'జై హనుమాన్' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'హను-మాన్'. సోషియో ఫాంటసీ కథాంశానికి పురాణాల నేపథ్యం జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అధ్బుతమైన విజయం సాధించిన వెంటనే, ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో ''జై హనుమాన్'' అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇది ‘హను-మాన్’ కు సీక్వెల్.
ఇందులో శ్రీరాముడు, ఆంజనేయ స్వామి పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి. అందుకే ఆ రెండు కీలకమైన పాత్రల్లో ఎవరు నటిస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే హనుమాన్ పాత్రలో ఒక స్టార్ హీరో నటిస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో హనుమంతుడిగా నటించే ఆ అగ్ర హీరో ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇందులో భాగంగా లేటెస్టుగా ఓ పాన్ ఇండియా స్టార్ పేరు తెర మీదకు వచ్చింది.
ముందుగా 'జై హనుమాన్' మూవీలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తారని వార్తలు వచ్చాయి. 'హనుమాన్' లో ఫేస్ సరిగా రివీల్ చేయకపోయినప్పటికీ, కళ్ళు చూస్తే రానానే అనిపిస్తుందని కథనాలు వెలువడ్డాయి. దీంతో హనుమాన్ పాత్ర పోషించేది రానా అని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
'జై హనుమాన్' సినిమాలో ఆంజనేయుడి పాత్ర కోసం యష్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇది భారీ స్థాయిలో తెరకెక్కే సూపర్ హీరో సినిమా కాబట్టి, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న KGF హీరో అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతలోనే తూచ్.. అవన్నీ ఒట్టి పుకార్లే అని, అందులో ఏమాత్రం నిజం లేదంటూ మరో వార్త వైరల్ అవుతోంది.
ఇలా రోజుకో కొత్త హనుమాన్ పాత్రధారి పేరు తెర మీదకు వస్తోంది కానీ, ప్రశాంత్ వర్మ మాత్రం మెగాస్టార్ చిరంజీవి అయితే తన సినిమాకు సరిగ్గా సరిపోతారని భావిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవిని తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అలానే శ్రీరాముడి పాత్రకు సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే బాగుంటుందని తెలిపారు. ఈ మధ్యనే ప్రీ ప్రొడక్షన్ పనులు పెట్టిన 'జై హనుమాన్' డైరెక్టర్.. త్వరలోనే తన హనుమాన్ ఎవరనేది వెల్లడిస్తారేమో చూడాలి.