ఇన్ని ప్రత్యేకతలున్నా భయమేల హనుమాన్?
మార్కెట్లో ఎన్ని బొమ్మలున్నా కంటికి ఇంపుగా మరిన్ని ప్రత్యేకతలతో ఉన్న బొమ్మపైకే అందరి దృష్టిపడుతుందన్నది అందరికి తెలిసిన సైకాలజీ
By: Tupaki Desk | 30 Aug 2023 6:26 AM GMTమార్కెట్లో ఎన్ని బొమ్మలున్నా కంటికి ఇంపుగా మరిన్ని ప్రత్యేకతలతో ఉన్న బొమ్మపైకే అందరి దృష్టిపడుతుందన్నది అందరికి తెలిసిన సైకాలజీ. ఎందుకంటే ప్రతి మనిషి చూపు చుట్టూ ఎన్ని ఉన్నా కంటికి ఇంపుగా ఉన్నదానిపైకే వెళుతుందనేది కామన్. అలా కంటికి ఇంపుగా ఉన్న బొమ్మ మార్కెట్‌లోకి రావాలా? వద్దా?..టీజర్‌ని వదిలి అంచనాల్ని పెంచేసి బరిలో దిగడానికి భయపడుతుంటే ఏమనుకోవాలి?..టీజర్‌లోనే స్టఫ్ ఉంది కానీ సినిమాలో పస లేదనేలా ఓ సినిమా టీమ్ భయపడుతోందా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
విషయం ఏంటంటే.. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో ఫాంటసీ స్టోరీతో రూపొందించిన ఇండియన్ తొలి సూపర్ హీరో సినిమా 'హను మాన్'. తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రైమ్ షో ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. సరికొత్త ప్రపంచం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ హను మాన్ ని ఇండియన్ సూపర్ హీరోగా చూపిస్తూ గ్రాఫిక్స్ హంగులతో రూపొందించారు.
కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తేజ సజ్జను హను మాన్ భక్తుడిగా చూపిస్తూనే ఆయనకు ప్రతీకగా ప్రజెంట్ చేసిన తీరు, యాక్షన్ సన్నివేశాలని విజువల్ ఎఫెక్ట్స్‌ని మిలితం చేసి వెండితెరపై ఆవిష్కరించిన తీరు సినీ ప్రియుల్ని అవాక్కయ్యేలా చేసింది. కొండల్ని ఆనుకుని ఆకాశాన్ని తాకే స్థాయిలో హను మాన్ విగ్రహాన్ని చూపించిన తీరు, హను మాన్ భక్తుడిగా తేజ విలన్‌లని గాల్లోకి ఎగిరేసే సన్నివేశాలు..
హాలీవుడ్ సూపర్ హారో తరహాలో ఒక్కసారిగా తేజ భూమిపైకి వాలడం.. మంచు కవర్ చేయగా అందులో హను మాన్ సజీవంగా కనిపించిన తీరు 'హను మాన్' సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మ్యాజిక్ చేయబోతున్నాడనే సంకేతాల్ని అందించింది. సినిమాలో ఇంత స్టఫ్ ఉన్నా కానీ 'హను మాన్' టీమ్ ఎందుకని రిలీజ్ విషయంలో వెనకడుగు వేస్తూ భయాన్ని ప్రదర్శిస్తోందన్నది సగటు ప్రేక్షకుడి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఈ సినిమా టజర్‌లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ఇసుమంతైనా 'ఆదిపురుష్'లో మచ్చుకైనా కనిపించలేదు.
వారే ఎలాంటి భయం లేకుండా థియేటర్లలోకి రాగా సినిమాతో విషయం, అబ్బుర పరిచే విజువల్స్ ఉన్నా ..'హను మాన్' టీమ్ రిలీజ్ విషయంలో ఎందుకు భయపడుతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా 2024, జనవరి 12న అయినా ఈ సినిమా రిలీజ్ చేస్తారా? లేక ఆ టైమ్‌లోనూ భారీ సినిమాల పోటీ ఉంటుందని ఎలాంటి పోటీ లేని టైమ్‌ని ఫిక్స్ చేసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.