Begin typing your search above and press return to search.

ఆమెలో ఆ రెండూ చూసాను: హ‌ను రాఘ‌వ‌పూడి

కానీ ఇప్పుడు అంత‌గా స్టార్ డ‌మ్ తో సంబంధం లేని, ఒక సాధార‌ణ సోష‌ల్ మీడియా క్వీన్ ని ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:50 PM GMT
ఆమెలో ఆ రెండూ చూసాను: హ‌ను రాఘ‌వ‌పూడి
X

పాన్ ఇండియాని షేక్ చేస్తున్న క్రేజీ స్టార్‌గా ప్ర‌భాస్ పేరు మార్మోగుతోంది. అత‌డి స‌ర‌స‌న అవ‌కాశాల కోసం ఇండియా బెస్ట్ హీరోయిన్లు అంతా వేచి చూస్తున్నారు. దీపిక ప‌దుకొనే, శ్ర‌ద్ధా క‌పూర్, జాక్విలిన్ లాంటి టాప్ హీరోయిన్లు ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించారు. కానీ ఇప్పుడు అంత‌గా స్టార్ డ‌మ్ తో సంబంధం లేని, ఒక సాధార‌ణ సోష‌ల్ మీడియా క్వీన్ ని ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఇమాన్ ఎస్మాయిల్ అనే అమ్మాయిని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ పూడి త‌న త‌దుప‌రి చిత్రం `ఫౌజీ` కోసం ఎంపిక చేసుకున్నారు. ఇందులో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఇమాన్ ఇస్మాయిల్ కి ఇదే తొలి సినిమా అవ‌కాశం. చాలా కాలంగా ఇమాన్వీ పేరుతో ఇన్ స్టాలో ఈ భామ ఎంతో ఫేమ‌స్. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోలతోనే బోలెడంత‌ పాపులారిటీ తెచ్చుకుంది. త‌న డ్యాన్సింగ్ వీడియోల‌తోనే దర్శకుడు హను రాఘవపూడి దృష్టిని ఆకర్షించింది.

ఇటీవ‌ల ప్ర‌భాస్- హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ మూవీ ఫౌజీ ప్రారంభోత్స‌వానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. వీటిలో ఇమాన్వీ అంద‌చందాలు చ‌క్క‌ని న‌వ్వు కుర్ర‌కారు హృద‌యాల‌ను ట‌చ్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇమాన్వీ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ అమాంతం పెరుగుతున్నారు. ఈ కాస్టింగ్ ఎంపిక ఉత్సుకతను రేకెత్తించింది. ఒక సోష‌ల్ మీడియా స్టార్ ఇలాంటి క్రేజీ ఆఫ‌ర్ ని ద‌క్కించుకోవ‌డం ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇమాన్వీ ఎంపిక గురించి డెక్కన్ క్రానికల్‌ ఇంటర్వ్యూలో హను రాఘ‌వ‌పూడి ఇలా వివరించాడు. ``కొత్త టాలెంట్‌లను కనుగొనడానికి సోషల్ మీడియా మంచి సులభమైన సాధనం. పరిశ్రమలో చాలామందికి సరైన ప్రతిభను ఎలా చేరుకోవాలో తెలియదు. కానీ క‌చ్చితంగా సోషల్ మీడియా తగిన నటీనటులను ఎంపిక చేసే ఆప్ష‌న్‌గా మారింది. ఇమాన్వీని సోష‌ల్ మీడియాలోనే క‌నుగొన్నాం. ఇమాన్వి డ్యాన్సింగ్ స్కిల్స్, క‌ళ్ల‌తోనే హావ‌భావాలు ప‌లికించే నైపుణ్యం న‌న్ను ఆక‌ట్టుకున్నాయి. ఈ అమ్మాయి తెరపైకి ప్రత్యేకమైన ప్ర‌ద‌ర్శ‌న‌ను తీసుకురాగలద‌ని న‌మ్మాం. ఇమాన్వి చాలా అందంగా ఉంది.. ప్రతిభావంతురాలు. అందరిలాగే నేనూ ఆమె డ్యాన్స్ వీడియోలు చూశాను. ఆమె గొప్ప భరతనాట్యం డాన్సర్. కళ్ళతోనే క‌ళ‌ను గొప్ప‌గా బ్యాలెన్స్ చేస్తుంది. ఆమెకు చాలా ఎక్స్‌ప్రెసివ్ గా మాట్లాడే కళ్ళు ఉన్నాయి. అందుకే త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకున్నాను.. ఇది నా ఒక్క‌డి నిర్ణ‌య‌మే కాదు.. టీమ్ అంద‌రి నిర్ణ‌యం!`` అని తెలిపారు.

ఇమాన్వి ఈ క్ష‌ణం వ‌ర‌కూ సోష‌ల్ మీడియా స్టార్ మాత్ర‌మే. ఇక‌పై అనూహ్యంగా పెద్ద స్టార్ కాబోతోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది కాబ‌ట్టి ఇమాన్వీ పాన్ ఇండియా రేంజులో ప‌రిచ‌యం అయిపోతుంది. ఇది త‌న‌కు పెద్ద అడ్వాంటేజ్‌. ప్ర‌భాస్ తో ఛాన్స్ అంటే ఇక‌ ఆకాశ‌మే హ‌ద్దు. ఇమాన్వి ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన‌ భరతనాట్యం వీడియోలు గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. తన క్రాఫ్ట్ పై త‌న‌కు ఉన్న‌ అంకితభావం ఫిలింమేక‌ర్స్ దృష్టిని ఆకర్షించింది.

ఫౌజీ చిత్రంలో ఇమాన్వి ప్ర‌భాస్ ప్రేమికురాలిగా క‌నిపిస్తుంది. ఇది 1940 నాటి కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ బ్రిటిష్ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ మూవీ కథాంశం గురించి ర‌క‌ర‌కాల పుకార్లు ఉన్నాయి. రజాకార్ల ఉద్యమం చుట్టూ తిరిగే పీరియాడికల్ డ్రామా అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో వెట‌ర‌న్ స్టార్లు మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.