హరోం హర ట్రైలర్.. సుధీర్ బాబు తుపాకుల మోత
హరోమ్ హర సినిమా జూన్ 14న విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు.
By: Tupaki Desk | 30 May 2024 7:00 AM GMTఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు ప్రతీ సినిమాలో కూడా చాలా కొత్తగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని కాన్సెప్ట్ లు కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. కానీ బ్యాడ్ లక్ ఏమిటో గాని బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ దక్కడం లేదు. కొత్తగా కాంబినేషన్లు బాగున్నప్పటికీ ఎక్కువగా అయితే దర్శకుల తడబాటు వల్ల విజయాలు దూరంగా ఉన్నాయి. ఇక ఈసారి, సుధీర్ బాబు పూర్తిగా మారిపోయి, కమర్షియల్ జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి "హరోం హర" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
హరోమ్ హర సినిమా జూన్ 14న విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. ఇది 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. సుధీర్ బాబు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే నిరుద్యోగి యువకుడి పాత్ర పోషిస్తున్నారు, అతను చిత్తూరు జిల్లాలోని కుప్పం గ్రామంలో నివసిస్తాడు.
నిరుద్యోగం కారణంగా తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకోలేక, తన స్నేహితుడు సునీల్ సలహాతో తుపాకీ తయారీలో నైపుణ్యాన్ని ఉపయోగించి, అతని జీవితాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం ఫలవంతం అవుతుంది, అతని తుపాకీ వ్యాపారం పెద్ద స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ విజయానికి అనుకున్న విధంగా శత్రువులు కూడా పెరుగుతారు, పోలీసుల గుప్తచార్యం కూడా ఉంటుందనేది కథా సారాంశం.
దర్శకుడు జ్ఞాన సాగర్ రెడ్డి, "హరోం హర" చిత్రాన్ని ఇంటెన్స్ డ్రామాగా మలచిన విధానం ఆసక్తికరంగా ఉంది. సుబ్రహ్మణ్యం పాత్రను అమాయకత్వంతో మొదలుపెట్టి, అరాచకానికి దారితీసే విధంగా చాలా పవర్ఫుల్ తీర్చిదిద్దడం కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గన్నులకు హీరోల పేర్లు పెట్టడం, అప్పటి కాలాన్ని ఆర్ట్ వర్క్ ద్వారా పునఃసృష్టించడం వంటి అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి.
మాళవిక శర్మ, సునీల్ వంటి వారు కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు, కానీ ట్రైలర్‌లో వాటిని పూర్తిగా రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణలు. ఇక "హరోం హర" చిత్రం విజయాన్ని సాధించడానికి మంచి టైమింగ్‌లో విడుదల అవుతోంది. ఏపీ ఫలితాలు వచ్చిన తరువాత చాలా కూల్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. సుధీర్ బాబు నటన, దర్శకుడి కొత్తదనానికి అందరూ మెచ్చుకునేలా ఉన్నారు. "హరోం హర" కంటెంట్ ఏమాత్రం క్లిక్కయినా కూడా మంచి కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది. మరి ఈసారి సుధీర్ బాబు ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.