తెలుగు నటులకు ఇక గడ్డుకాలమేనా?
టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ నడుమ తెలుగు నటులకు ఉన్న అవకాశాలు కూడా తగ్గిపోతాయా? అంటే అవుననే విశ్లేషకులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Sep 2023 11:30 PM GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు నటులకు అవకాశాలివ్వడం లేదని చాలా కాలంగా వినిపిస్తున్నదే. హీరోకి ధీటుగా ఉండే పాత్రలేవైనా బాలీవుడ్ నటులకే కట్టబెడతారు అన్న అపవాద ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యమైన పాత్రలు పోషించాలంటే హిందీ నటులు దిగుమతి అవ్వాల్సిందే. వాళ్లతో మాత్రమే ఆ పాత్రలు భర్తీ చేస్తుంటారు. కొన్ని చిన్న పాత్రలు తప్ప కీలమైన పాత్రలేవైనా ఉత్తరాది నటులకే పెద్ద పీట వేస్తారని ఆగ్రహ జ్వాలలు తెరపైకి వచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి.
మరి తాజా సినారేలో ఆ పరిస్థితి మరింత జఠిలం కాబోతుందా? టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ నడుమ తెలుగు నటులకు ఉన్న అవకాశాలు కూడా తగ్గిపోతాయా? అంటే అవుననే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు హిందీ నటులతో పాటు కొత్తగా మాలీవుడ్..కోలీవుడ్ నటులు కూడా తొడైన సన్నివేశం కనిపిస్తూనే ఉంది. హీరోకి ధీటైన పాత్రల్లో వాళ్లు తప్ప తెలుగు నటులెవరూ పెద్దగా కనిపించడం లేదు.
స్టార్ హీరోల చిత్రాల్లో హీరో ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని ప్రతి నాయకుడి పాత్రకు తీసుకుంటారు. చివరికి సహాయక పాత్రల్లో కూడా మెజార్టీ వర్గం వాళ్లే కనిపిస్తు న్నారని కొత్త వాదన తెరపైకి వస్తోంది. పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడ్నీ సీన్ లోకి తెస్తున్నారు. ఆయా భాషల్లో మార్కెట్ చేసుకునేందుకు ఓ రకమైన స్ట్రాటజీ ఇది. కోట్లలో పెట్టుబడి కాబట్టి ఇలాంటివి తప్పవు.
అయితే ఇటీవలే ఓ పేరున్న నటుడు సినిమా ఆఫీస్ కి వెళ్తే సదరు డైరెక్టర్ ఆ పాత్రకి ఓ తమిళ నటుడ్ని తీసుకున్నామని చెప్పారుట. ఆ సినిమా పాన్ ఇండియా కూడా కాదు. కేవలం రీజనల్ గా రిలీజ్ అయ్యే చిత్రం. మాకెందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించాడుట. దానికి ఆఫీస్ స్టాప్ మీకు ఛాన్స్ ఇవ్వాలని ఇక్కడేమైనా రాసి పెట్టి ఉందా? రాజ్యంగంలో రాసారా? అని ఎదురు దాడి చేసారుట.
ఇలా తెరపైకి రాని ఎంతో మంది తెలుగు నటులు ఉన్నారని సదరు నటుడు అభిప్రాయపడ్డాడు. మునుముందు తెలుగు వాళ్లకు అవకాశాలు మరింత కష్టతరంగా మారుతుందని అన్నారు. ఓ లో సభ్యత్వం ఉన్నా పేరుకే తప్ప! అసోసియేషన్ ద్వారా ఎలాంటి అవకాశాలు రావడం లేదని మరికొంత మంది ఆరోపిస్తున్నారు.