వీరమల్లుతో సై అంటే ఎలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఎప్పుడెప్పుడు థియేటర్లలో అలరిస్తాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో హరి హర వీర మల్లు విడుదల తేదీ ఖరారైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 11:50 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఎప్పుడెప్పుడు థియేటర్లలో అలరిస్తాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో హరి హర వీర మల్లు విడుదల తేదీ ఖరారైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినిమా పోస్టుపోన్ అవుతుందనే అనుమానాలు ఉన్నా, చిత్రబృందం మాత్రం క్లారిటీ ఇచ్చింది. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం మరోసారి ధృవీకరించింది. ఇక పవన్ అభిమానులు ఈ వార్తను తెగ సంతోషించుకుంటూ సినిమాకు భారీగా అంచనాలు పెంచుతున్నారు.
అయితే ఈ అదే రోజున టాలీవుడ్ యంగ్ హీరో, పవన్ డైహార్డ్ ఫ్యాన్ నితిన్ తన సినిమా రాబిన్ హుడ్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాబిన్ హుడ్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు చిత్రబృందం రిలీజ్ డేట్ మార్చి 28గా ప్రకటించింది. అంతేకాదు, ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన దేవదత్త నాగ్ లుక్ ను రిలీజ్ చేశారు. సినిమాలో ‘సామీ’ పాత్రలో ఆయన కనిపించబోతుండగా, ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
నితిన్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన అభిమానాన్ని పబ్లిక్‌గా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు. ఇక పవన్ కూడా నితిన్ ను ఫ్యాన్‌గా చూడటమే కాదు, ప్రత్యేక అభిమానం కూడా కలిగివున్నారు. గతంలో ఎప్పుడైనా తన సినిమాకు పవన్ సినిమా క్లాష్ అయినా, పవన్ సినిమానే చూసేందుకు వెళ్లిపోతానని నితిన్ చెబుతుండేవాడు. కానీ ఈసారి ఆయన స్వయంగా పవన్ మూవీకి గట్టి పోటీ ఇస్తుండడం ఆసక్తిగా మారింది.
పవన్ ఫ్యాన్స్ సాధారణంగా నితిన్ సినిమాలను కూడా ఆదరిస్తారు. అయితే ఈసారి తమ హీరో సినిమా వస్తున్న క్రమంలో రాబిన్ హుడ్ పై ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి. పైగా, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడం వల్ల కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువే. దీంతో రాబిన్ హుడ్ టీమ్ చివరి నిమిషంలో డేట్ మార్చే ఆలోచన చేస్తుందా? లేక డేరింగ్‌గా అదే డేట్‌లోనే రిలీజ్ చేస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.
రాబిన్ హుడ్ మూవీని వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ - నితిన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. మరోవైపు, హరి హర వీర మల్లు ఏ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న సినిమా. పవన్ కళ్యాణ్‌కు ఇది ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా ఎలాగైనా గ్రాండ్ రిలీజ్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.