సెకెండ్ సింగిల్ తోనైనా ఊపుతారా?
ఈ నేపథ్యంలో తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రెండవ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం పెట్టినట్లు సమాచారం.
By: Tupaki Desk | 4 Feb 2025 5:33 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న పీరియాడిక్ చిత్రం `హరిహర వీరమల్లు` లిరికల్ సింగిల్స్ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన `మాట వినాలి` పాటను రిలీజ్ చేసారు. కొన్ని వారాల క్రితమే ఈ పాట రిలీజ్ అయింది. కానీ ఈపాట ఏమాత్రం శ్రోతలకి ఎక్కలేదు. వాళ్ల సంగతి పక్కనబెడితే పవన్ కళ్యాణ్ అభిమానులే మధ్యే పాట ఇలా ఉందేంటి? అనే చర్చ సాగింది.
ఏదో ఊహించుకుంటే? ఇంకేదో జరిగింది . తొలి లిరికల్ ఇంత చప్పగా ఉందేంటి? అంటూ గుసు గుసలాడుకున్నారు. పాట నెమ్మదిగా సాగడం...పాటలో ఎక్స్ ప్రెషన్స్ సైతం సరిగ్గా క్యారీ అవ్వలేదనే విమర్శ వ్యక్తమైంది. ఆ పాటతో మరింత బజ్ క్రియేట్ అవుతుందని యూనిట్ భావించింది. కానీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రెండవ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం పెట్టినట్లు సమాచారం.
ఈ పాట కూడా జానపదమేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. అలాగే ఇప్పటి వరకూ నిధి అగర్వాల్ పాత్రకు సంబంధించి కూడా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆ పాటలో నిధి లుక్ సహా పాత్ర గురించి హింట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పాటతో కీరవాణి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. `బాహుబలి` తరహాలో పాటలుంటాయని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు.
కీరవాణి అలాంటి సంగీతమే అందించి ఉంటారని చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి తొలి సింగిల్ నిరుత్సాహ పరిచిన వేళ మలి సింగిల్ తోనైనా శ్రోతల్లో ఆ ఊపు తీసుకొస్తారేమో చూడాలి. అలాగే సినిమాలో పాటలు ఎన్ని అన్నది కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పవన్ ఇంకా నాలుగు రోజులు డేట్లు ఇస్తే అతడి పోర్షన్ పూర్తవుతుంది. బ్యాలెన్స్ షూట్ కూడా ఫిబ్రవరికల్లా పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్.