Begin typing your search above and press return to search.

వాలంటైన్స్‌ డే స్పెషల్‌... వీరమల్లు 'కొల్లగొట్టినాదిరో'

పవన్‌ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అయినా మూడు ఏళ్ల క్రితం ప్రారంభించిన 'హరి హర వీరమల్లు' సినిమాను ముగించేందుకు డేట్లు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 7:07 AM GMT
వాలంటైన్స్‌ డే స్పెషల్‌... వీరమల్లు కొల్లగొట్టినాదిరో
X

పవన్‌ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అయినా మూడు ఏళ్ల క్రితం ప్రారంభించిన 'హరి హర వీరమల్లు' సినిమాను ముగించేందుకు డేట్లు ఇచ్చారు. మరో వారం రోజుల డేట్లతో సినిమా షూటింగ్‌ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇటీవల సినిమా నుంచి ఒక పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. అత్యధిక వ్యూస్ దక్కించుకుని సినిమాపై అంచనాలు పెంచింది. హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా కొత్త సాంగ్ పోస్టర్‌ను విడుదల చేశారు.


సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మధ్య 'కొల్లగొట్టినాదిరో..' అంటూ సాగే పాటను ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించిన నేపథ్యంలో ప్రేక్షకుల్లో ప్రతి పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్న కీరవాణి నుంచి రాబోతున్న పెద్ద ఆల్బం ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కీరవాణి సంగీతం ఉంటుంది.

కొల్లగొట్టినాదిరో... అంటూ సాగే పాటలో పవన్ కళ్యాణ్‌, నిధి అగర్వాల్‌ జంటగా కనిపించబోతున్నారు. పోస్టర్‌ చూస్తూ ఉంటే నిధి అగర్వాల్‌ చాలా అందంగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అంతకు ముందు చూసిన గెటప్‌లోనే కనిపిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆ తేదీకి సినిమా రావడం కష్టం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ తేదీన పవన్ సినిమా ఎలాగూ రాదనే ఉద్దేశంతో అదే రోజు చిన్న సినిమాలు ఒకటి రెండు రాబోతున్నాయి. తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించాయి. కానీ వీరమల్లు మేకర్స్ మాత్రం విడుదల తేదీ మార్చి 28న అని మరోసారి ఈ పోస్టర్‌తో చెప్పకనే చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లి బీజీ కావడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వక పోవడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బ్యాలన్స్ వర్క్‌ను నిర్మాత ఎం ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాలోనూ నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు సైతం ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రెండు సినిమాలను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని పవన్‌ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.